Russia: "ఇక చీపురుకట్టలపై ఎగురుతూ వెళతారు"... అమెరికాకు రాకెట్ ఇంజిన్ల సరఫరా నిలిపివేస్తూ రష్యా వ్యంగ్యం

  • ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
  • ఆంక్షలు విధించిన ఈయూ, నాటో దేశాలు
  • 1990 నుంచి అమెరికాకు రష్యా నుంచి రాకెట్ ఇంజిన్లు
  • గతంలో ఇచ్చిన ఇంజిన్లకు సర్వీసింగ్ కూడా చేయబోమన్న రష్యా
Russia stops rocket engines supply to US

ఉక్రెయిన్ పై దాడికి దిగిందన్న కారణంతో ఈయూ దేశాలు, నాటో దేశాలు రష్యాపై అత్యంత తీవ్ర ఆంక్షలు విధించడం తెలిసిందే. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ దేశంపై విధించనంత కఠిన ఆంక్షలు రష్యాపై విధించాయి. దాంతో, భగ్గుమంటున్న రష్యా కూడా ప్రతీకార చర్యలకు దిగుతోంది. తాజాగా అమెరికాకు రాకెట్ ఇంజిన్ల సరఫరా నిలిపివేసింది. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ అధిపతి దిమిత్రీ రోగోజిన్ ఈ మేరకు వెల్లడించారు. 

ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రపంచ అత్యుత్తమ శ్రేణి రాకెట్ ఇంజిన్లను అమెరికాకు అందించలేమని స్పష్టం చేశారు. ఇక అమెరికన్లు దేనిపై అంతరిక్ష యాత్రలకు వెళతారో వాళ్లే తేల్చుకుంటారు. చీపురుకట్టలపై ఎగురుకుంటూ వెళతారో, ఇంకేమైనా వస్తువులపై వెళతారో నాకైతే తెలియదు అంటూ రోగోజిన్ వ్యంగ్యం ప్రదర్శించారు. 

హ్యారీ పోటర్ చిత్రాల్లో హీరో ఓ చీపురుకట్టపై కూర్చుంటే అది గాల్లోకి రివ్వున దూసుకెళ్లడం తెలిసే ఉంటుంది. అది మ్యాజిక్ చీపురుకట్ట. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాస్ కాస్మోస్ చీఫ్ సెటైర్ వేసినట్టు అర్థమవుతోంది. 

సోవియట్ కాలం నుంచి అంతరిక్ష రంగంలో రష్యా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత కూడా రష్యా ఆ ఒరవడిని కొనసాగించింది. 1990 నుంచి అమెరికాకు రష్యా నుంచి రాకెట్ ఇంజిన్ల సరఫరా కొనసాగుతోంది. ఇప్పటివరకు 122 ఆర్డీ-180 ఇంజిన్లను రష్యా... అమెరికాకు అందించింది. వీటిలో 98 ఇంజిన్లను అట్లాస్ వ్యోమనౌక ప్రయోగాలకు ఉపయోగించారు. 

ఇప్పుడు రష్యా నిర్ణయంతో అమెరికా అంతరిక్ష ప్రయోగాలకు విఘాతం తప్పదని నిపుణులు భావిస్తున్నారు. రష్యా ఇంజిన్ల సరఫరా నిలిపివేయడం మాత్రమే కాదు, గతంలో సరఫరా చేసిన ఇంజిన్లకు సర్వీసింగ్ సేవలను కూడా అందించబోమని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు రష్యా సాంకేతిక సాయం అవసరమైన ఇంజిన్లు అమెరికా వద్ద 24 ఉన్నాయి. వీటి పరిస్థితి ఏంటన్నది అమెరికాకు సమస్యగా మారింది. 

ఈయూ దేశాలు ఆంక్షలు విధించగానే, రష్యా ఫ్రెంచ్ గయానాలోని కౌరూ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి తన సాంకేతిక నిపుణులను, సిబ్బందిని వెంటనే వెనక్కి పిలిచింది. దాంతో కౌరూ నుంచి యూరప్ దేశాలు చేపట్టే రాకెట్ ప్రయోగాలకు ఆటంకం ఏర్పడనుంది. 

కాగా, రష్యా గతంలో బ్రిటన్ కు చెందిన శాటిలైట్ సంస్థ ఒన్ వెబ్ కు చెందిన ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టింది. ఆ శాటిలైట్లను సైనిక అవసరాల కోసం ఉపయోగించబోమంటూ ఒన్ వెబ్ సంస్థ హామీ ఇవ్వాలంటూ రష్యా డిమాండ్ చేస్తోంది. ఒన్ వెబ్ సంస్థలో బ్రిటన్ ప్రభుత్వానికి కూడా వాటాలు ఉన్నాయి. అందుకే ఆ సంస్థ విషయంలో రష్యా ఆందోళన చెందుతోంది. 

ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత చర్యలు తీసుకున్న సంస్థల్లో ఒన్ వెబ్ కూడా ఉంది. ఇకపై తాము కజకిస్థాన్ లో రష్యాకు చెందిన బైకనూర్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఎలాంటి ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టబోమని ఒన్ వెబ్ ప్రకటించింది.

More Telugu News