Future group: అమెజాన్-ఫ్యూచర్ గ్రూపు వివాదం యూటర్న్.. కోర్టు బయట పరిష్కారానికి చర్చలు

  • అంగీకరించిన ఇరు పార్టీలు
  • 12 రోజుల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు
  • తిరిగి 15న ఈ కేసులో విచారణ
Future group Amazon lawyers agree to initiate talks for an out of court settlement

కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు, అమెరికాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మధ్య సంధి దిశగా అడుగులు పడుతున్నాయి. 18 నెలలుగా ఇరు సంస్థలు న్యాయ పోరాటం చేస్తుండడం తెలిసిందే. పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయిన ఫ్యూచర్ గ్రూపు తన ఎఫ్ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రిటైల్, హోల్ సేల్, లాజిస్టిక్స్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ కు రూ.24,731 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. 

అప్పటికే ఫ్యూచర్ రిటైల్ లో.. ఫ్యూచర్ కూపన్స్ రూపంలో అమెజాన్ కు 5 శాతం వరకు వాటా ఉంది. దీంతో ఫ్యూచర్ రిటైల్ లో వాటాను విక్రయిస్తే కొనుగోలు చేసే మొదటి హక్కు తమకే ఉందంటూ అమెజాన్ సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించడం, అనుకూల ఆదేశాలు పొందడం తెలిసిందే. ఆ తర్వాత ఈ వివాదం ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులకు చేరింది. 

ఈ కేసులో కోర్టు బయట పరిష్కారానికి వీలుగా చర్చల నిర్వహణకు ఇరు కంపెనీల లాయర్లు సుప్రీంకోర్టు ముందు గురువారం అంగీకారం తెలిపారు. దీంతో చర్చలకు, చట్టపరమైన ప్రతిష్టంభనకు పరిష్కారం కొనుగొనడానికి వీలుగా సుప్రీంకోర్టు 12 రోజుల గడువు ఇచ్చింది. ఈ అంశంపై తిరిగి మార్చి 15న వాదనలు వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. 

మరోవైపు ఫ్యూచర్ గ్రూపు నుంచి తమ రుణ బకాయిలు రాకపోవడంతో బ్యాంకులు నిరర్థక రుణ ఖాతాలుగా ప్రకటించాయి. దీంతో లిక్విడిటీ సంక్షోభాన్ని ఫ్యూచర్ గ్రూపు ఎదుర్కొంటోంది. ఢిల్లీ హైకోర్టు, ఎన్ సీఎల్ టీ తమ చర్యలను కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

More Telugu News