Telangana: శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర‌.. జితేంద‌ర్‌రెడ్డి, డీకే అరుణ‌ల పాత్ర‌పై విచార‌ణ‌ చేస్తామన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్

  • ఇప్ప‌టిదాకా ఏడుగురు నిందితుల అరెస్ట్‌
  • వారిలో ముగ్గురికి జితేంద‌ర్ రెడ్డి నివాసంలో ఆశ్ర‌యం
  • ఫ‌లితంగా జితేంద‌ర్ రెడ్డి పాత్ర‌పై పోలీసుల అనుమానం
  • రాజకీయ వైరం కార‌ణంగా డీకే అరుణ పాత్ర‌పైనా అనుమానాలు
  • వెనువెంట‌నే స్పందించిన డీకే అరుణ‌
  • మంత్రిపై త‌మ‌కెందుకు క‌క్ష ఉంటుంద‌ని ప్ర‌శ్న
Conspiracy to assassinate Srinivas Goud Inquiry into the role of Jitender Reddy and DK Aruna

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు జ‌రిగిన కుట్ర తెలంగాణ రాజ‌కీయాల్లో అగ్గి రాజేసేలానే క‌నిపిస్తోంది. మంత్రి హ‌త్య‌కు జ‌రిగిన కుట్ర‌లో బీజేపీ సీనియ‌ర్ నేత, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి పాత్ర‌తో పాటు ఆ పార్టీకి చెందిన మహిళా నేత‌, మాజీ మంత్రి డీకే అరుణ పాత్ర‌పైనా ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లుగా సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర వెల్ల‌డించారు. మంత్రి హ‌త్య‌కు జ‌రిగిన కుట్ర‌కు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన స్టీఫెన్ ర‌వీంద్ర ప‌లు సంచ‌ల‌న విష‌యాల‌ను తెలిపారు. 

మంత్రి హ‌త్య‌కు ప్లాన్ చేసిన వారిలో ర‌ఘు అనే వ్య‌క్తిని జితేంద‌ర్ రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మంత్రిని హ‌త్య చేసేందుకు జ‌రిగిన కుట్ర పోలీసుల ప్ర‌మేయం లేకుండానే బ‌య‌ట‌ప‌డింద‌ని చెప్పిన క‌మిష‌న‌ర్.. ప్లాన్ చేసిన వారిలో కొంద‌రిపై మ‌రికొంద‌రు దాడికి య‌త్నించడంతోనే ఈ ఘ‌ట‌న వెలుగు చూసింద‌న్నారు. మంత్రిని హ‌త్య చేసేందుకు జ‌రిగిన కుట్ర‌లో ఇప్ప‌టికే 8 మందిని అరెస్ట్ చేసిన‌ట్లుగా ఆయ‌న తెలిపారు. వీరిలో ముగ్గురు వ్య‌క్తులు ఢిల్లీలోని జితేంద‌ర్ రెడ్డి నివాసంలో ఉంటున్న‌ట్లుగా గుర్తించామ‌ని, ఢిల్లీ పోలీసుల స‌హ‌కారంతోనే వారిని అరెస్ట్ చేశామ‌ని ఆయ‌న తెలిపారు.

మంత్రి హ‌త్య‌కు కుట్ర చేసిన వారిలో కొంద‌రు జితేంద‌ర్ రెడ్డి నివాసంలో ఆశ్ర‌యం పొందిన నేప‌థ్యంలో ఈ కుట్ర‌లో మాజీ ఎంపీ పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణంలో విచార‌ణ చేప‌ట్ట‌నున్నట్టుగా స్టీఫెన్ ర‌వీంద్ర చెప్పారు. అదే స‌మ‌యంలో మాజీ మంత్రి డీకే అరుణ పాత్ర కూడా ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ ద‌ర్యాప్తు సాగిస్తామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. మంత్రి హ‌త్య‌కు జ‌రిగిన కుట్ర‌లో ఆదిలోనే ఇద్ద‌రు కీల‌క నేత‌ల పేర్లు పోలీసుల నోట వినిపించ‌డం నిజంగా క‌ల‌క‌లం రేపుతోంది.

ఇదిలా ఉంటే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ‌త్యకు జ‌రిగిన కుట్ర‌లో త‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో చాలా వేగంగా డీకే అరుణ స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరాచ‌కాలు అంద‌రికీ తెలిసిన‌వేన‌న్న డీకే అరుణ‌... ఈ వ్య‌వ‌హారంలో అస‌లు నిజాలు బ‌య‌ట‌పెట్టాల‌ని పోలీసుల‌ను డిమాండ్ చేశారు. అయినా త‌మకు శ్రీనివాస్ గౌడ్‌పై క‌క్ష ఎందుకు ఉంటుంద‌ని కూడా ఆమె ప్ర‌శ్నించారు.

  • Loading...

More Telugu News