Naveen: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలకు బదులిచ్చిన వైద్య విద్యార్థి నవీన్ తండ్రి

  • ఉక్రెయిన్ లో రష్యా దాడులకు బలైన భారత విద్యార్థి నవీన్
  • వైద్యవిద్య కోసం విదేశాలకు వెళ్లడం ఎందుకన్న మంత్రి జోషి
  • భారత్ లో మెడిసిన్ కు భారీగా ఖర్చవుతుందన్న నవీన్ తండ్రి
  • యాజమాన్య కోటాలో కోట్లు వెచ్చించాలని వెల్లడి
Medical student Naveen father Shekharappa responds to union minister Prahlad Joshi comments

విదేశాల్లో వైద్య విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. విదేశాల్లో మెడిసిన్ చదివిన 90 శాతం మంది విద్యార్థులు భారత్ లో నిర్వహించే అర్హత పరీక్షలో ఫెయిల్ అవుతున్నారని జోషి పేర్కొన్నారు. ఆ మాత్రం దానికి విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడం ఎందుకన్న కోణంలో ఆయన వ్యాఖ్యానించారు. 

నిన్న ఉక్రెయిన్ లో రష్యా దాడుల్లో భారతీయ వైద్య విద్యార్థి నవీన్ మరణించడం తెలిసిందే. నవీన్ కర్ణాటకకు చెందినవాడు. కాగా, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలపై నవీన్ తండ్రి శేఖరప్ప జ్ఞానగౌడర్ స్పందించారు. భారత్ లో వైద్య విద్య చదివేందుకు పెద్దమొత్తంలో డొనేషన్ చెల్లించాలని, దాంతో బాగా చదివే విద్యార్థులు విదేశాల బాటపడుతున్నారని జ్ఞానగౌడర్ వెల్లడించారు. కర్ణాటకలో మెడిసిన్ చదివేందుకు చెల్లించాల్సిన మొత్తం కంటే విదేశాల్లో చాలా తక్కువ ఖర్చుతో విద్యాభ్యాసం పూర్తి చేస్తున్నారని వివరించారు. 

అదే ఇక్కడ ఓ విద్యార్థి యాజమాన్య కోటాలో మెడికల్ సీటు పొందాలంటే కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. తన కుమారుడు నవీన్ ఎంతో ప్రతిభావంతుడైన విద్యార్థి అని, భారత్ లో చదివించే స్తోమత లేకపోవడంతో ఉక్రెయిన్ కు పంపామని తెలిపారు.

  • Loading...

More Telugu News