Russia: నాటోకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హెచ్చరిక

  • ఉక్రెయిన్ ఓడిపోతే మాకు పట్టిన గతే నాటో దేశాలకూ పడుతుంది
  • ఆ దేశాల సరిహద్దులకు రష్యా వచ్చి కూర్చుంటుంది
  • నాటోలో సభ్యత్వం ఇవ్వకుంటే.. సెక్యూరిటీ గ్యారెంటీ ఇవ్వాలి
  • సీఎన్ఎన్, రాయిటర్స్ సంయుక్త ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు
If Ukraine Loses President Zelensky Warns NATO

రెండో రౌండ్ శాంతి చర్చలు సజావుగా సాగాలంటే ముందు రష్యా తమపై బాంబులేయడం ఆపేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పష్టం చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓ ప్రభుత్వ ఆఫీసులో సీఎన్ఎన్, రాయిటర్స్ వార్తాసంస్థలు సంయుక్తంగా చేసిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ జరిగే సమయంలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని హోలోకాస్ట్ స్మారకం వద్ద ఉన్న టీవీ టవర్ ను రష్యా కూల్చేసింది.  

సభ్యత్వం ఇవ్వకుండా నాటో నిర్ణయం తీసుకుంటే.. చట్టపరంగా వచ్చే భద్రత హామీనైనా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టపరంగా భద్రత గ్యారెంటీని ఇస్తే తమ భౌగోళిక సమగ్రత, సరిహద్దులను కాపాడుకోగలుగుతామని, తమ పొరుగు దేశాలతో ప్రత్యేక సంబంధాలను కొనసాగించగలుగుతామని, సురక్షితంగా ఉంటామని ఆయన చెప్పారు. ఒకవేళ యుద్ధంలో ఉక్రెయిన్ అంటూ ఓడిపోతే.. రష్యా బలగాలు నాటో సభ్య దేశాల సరిహద్దులకు వచ్చి కూర్చుంటాయన్న విషయాన్ని గుర్తెరగాలని హెచ్చరించారు. తమకు పట్టిన గతే ఆ దేశాలకూ పడుతుందన్నారు. 

రష్యాపై ఇప్పటిదాకా పెడుతున్న ఆంక్షలు సరిపోవని, మరిన్ని కఠినమైన ఆంక్షలను విధించాల్సిందిగా ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేశారు. తమపై దాడులు జరగకుండా ఉండాలంటే రష్యా వాయుసేనపై నిషేధం విధించాలని, ఆ దేశ విమానాలకు ‘నో ఫ్లై జోన్’ను విధించాలని నాటోను ఆయన కోరారు.  రష్యా వాయుసేనలకు నో ఫ్లై జోన్ విధించినంత మాత్రాన అవి యుద్ధంలోకి దిగినట్టు కాదని చెప్పారు. ప్రస్తుతం రష్యాకు నో ఫ్లై జోన్ ను విధించడం సాధ్యం కాదంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారన్నారు. 

రష్యాపై ఆంక్షలు విధించాలంటూ యుద్ధం మొదలు కాకముందే అమెరికా, ఐరోపా దేశాలను కోరినా పెడచెవిన పెట్టాయన్నారు. అయితే, యుద్ధంతో అతలాకుతలమైన తమ దేశానికి ఆర్థికంగా సాయం అందిస్తున్నాయని, వీలైనంత వేగంగా తమకు సాయం అందేలా చూడాలని కోరారు. తామిప్పుడు యుద్ధ రంగంలోకి దిగిపోయామని, తమకు ప్రతిరోజూ సాయం అవసరమేనని జెలెన్ స్కీ స్పష్టం చేశారు.

నా పిల్లలను కూడా చూడలేదు

రెండు రోజులుగా తాను తన పిల్లలను చూడనే లేదని జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధాన్ని ఉక్రెయిన్ ఇంకా ఎన్ని రోజులు తట్టుకుంటుందని ప్రశ్నించగా.. ప్రస్తుత పరిస్థితుల్లో తాము యుద్ధాన్ని నిలువరించే పరిస్థితుల్లో లేమని, పోరాటమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. తుదికంటా పోరాడుతామని తేల్చి చెప్పారు. ‘‘ఇది మా ఇల్లు. పిల్లలు చచ్చిపోతున్నారు. మా పిల్లల భవిష్యత్ కోసం మా భూమిని, మా ఇంటిని మేం కాపాడుకుని తీరుతాం’’ అని గద్గద స్వరంతో ఆయన చెప్పుకొచ్చారు. 

జీవించే హక్కును తాము కాపాడుకుంటామని స్పష్టం చేశారు. రష్యా వాళ్లకు తమ ప్రజల మనస్తత్వం, తమ దేశం, తమ సిద్ధాంతాలు అర్థం కాబోవన్నారు. ఇక్కడి పరిస్థితుల గురించి వాళ్లకేం తెలియదని అన్నారు. వాళ్లు తమను చంపడానికి లేదంటే వాళ్లు చావడానికే ఉక్రెయిన్ పై దండయాత్రకు వస్తున్నారని అన్నారు.

More Telugu News