Olena Zelenska: భర్తకు తగ్గ భార్య... ఉక్రెయిన్ ప్రథమ మహిళ జెలెన్ స్కా తీరు స్ఫూర్తిదాయకం

  • ఉక్రెయిన్ పై రష్యా భీకరదాడులు
  • ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న వొలెనా జెలెన్ స్కా
  • అజ్ఞాతంలో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో క్రియాశీలకం
  • దేశ ప్రథమ మహిళగా బాధ్యత నిర్వహిస్తున్న వైనం
Story of Ukraine president wife Olena Zelenska

సాధారణంగా ఏ దేశాన్ని అయినా ప్రత్యర్థి దేశం కబళిస్తుంటే ఆ దేశాధినేతలు, కీలక నేతలు ఇతర దేశాలకు పారిపోయి రాజకీయ ఆశ్రయం పొందడం సహజం. రష్యా దండయాత్ర నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీకి కూడా ఇలాంటి ప్రతిపాదనలే వచ్చాయి. తమ దేశానికి వస్తే ఆశ్రయం కల్పిస్తామని పలు దేశాలు స్నేహహస్తం చాచాయి. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు. దేశం తర్వాతే ఏదైనా అంటూ ఆయన ఉక్రెయిన్ లోనే ఉండి సైనికుల్లో స్ఫూర్తిని రగిలిస్తున్నారు. 

అయితే, జెలెన్ స్కీని సదా వెన్నంటి ఉంటూ, ధైర్యం కోల్పోకుండా కార్యోన్ముఖుడ్ని చేస్తున్నది మాత్రం ఆయన అర్ధాంగి వొలెనా జెలెన్ స్కా. తాము దేశం విడిచి పారిపోలేదని, ఉక్రెయిన్ లోనే ఉండి పోరాడుతున్నామని జెలెన్ స్కా గర్వంగా చెబుతోంది. జెలెన్ స్కీ, జెలెన్ స్కా దంపతులకు పిల్లలు ఉన్నప్పటికీ, ఉక్రెయిన్ ను కాపాడుకోవడమే ప్రథమ ప్రాధాన్యత అంటూ ఈ కుటుంబం దేశంలోని ఉండిపోయింది.

44 ఏళ్ల జెలెన్ స్కా ఆర్కిటెక్కర్ నిపుణురాలు. ఆమె రచయిత కూడా. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, జెలెన్ స్కా బాల్యం నుంచే కలిసి చదువుకున్నారు. అయితే కాలేజీకి వచ్చాకే ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆపై అది ప్రేమగా మారింది. వీరిద్దరూ 2003లో పెళ్లితో ఒక్కటయ్యారు. 

ఓ దశలో నటుడిగా కెరీర్ మంచి దశలో ఉండగా, జెలెన్ స్కీ రాజకీయాలవైపు అడుగులేశారు. తొలినాళ్లలో భర్త రాజకీయాల్లోకి వెళ్లడం ఆమెకు ఇష్టంలేకపోయినా, తర్వాత భర్త నిర్ణయాన్ని గౌరవించారు. ప్రతి అంశంలోనూ, ఆఖరికి యుద్ధం వేళ కూడా ఆమె భర్తను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న తీరు ఉక్రెయిన్ వాసులను ఆకట్టుకుంటోంది. 

కాగా, రష్యా సేనలు ప్రస్తుతం ఉక్రెయిన్ లో తీవ్ర దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో జెలెన్ స్కా ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అయితే సోషల్ మీడియాలో ఆమె తన పోస్టులతో దేశభక్తి పెంపొందిస్తున్నారు. "ఇది యుద్ధ సమయం... నా పిల్లలు నా వైపే చూస్తున్నారు. నా అవసరం వారికి ఎంతో ఉంది. ఈ కష్టకాలంలో నా భర్త పక్కన కూడా నేనుండాలి. నా దేశ ప్రజలకు కూడా నేను తోడుండాలి" అంటూ ఆమె స్ఫూర్తిదాయక పోస్టులు చేస్తున్నారు.

More Telugu News