Rahul Gandhi: ప్రతి నిమిషం విలువైనదే... ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపునకు నిర్దిష్ట ప్రణాళిక ఉండాలి: రాహుల్ గాంధీ

  • ఉక్రెయిన్ పై రష్యా మరిన్ని దాడులు
  • ఖార్కివ్ నగరంపై బాంబుల వర్షం
  • భారత విద్యార్థి నవీన్ మృతి
  • ప్రగాఢ సంతాపం తెలియజేసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi reacts to Indian student tragic death in Ukraine

ఉక్రెయిన్ లో రష్యా దళాల దాడిలో ఓ భారతీయ విద్యార్థి (నవీన్) మృతి చెందడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. భారతీయ విద్యార్థి నవీన్ ఉక్రెయిన్ లో మరణించాడన్న విషాదకర వార్త విన్నానని, నవీన్ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

"నేను మరోసారి చెబుతున్నా... ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలంటే ఓ నిర్దిష్ట ప్రణాళిక ఉండాలి. వ్యూహాత్మకంగా నడుచుకోవాలి. ప్రతి నిమిషం విలువైనదే" అంటూ కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. 

అపారసైనిక బలగం, భారీ ఆయుధ సంపత్తి కలిగిన రష్యా... ఇన్ని రోజులు గడుస్తున్నా ఉక్రెయిన్ లొంగకపోవడం పట్ల తీవ్ర అసహనంతో ఉంది. మరిన్ని బలగాలను ఉక్రెయిన్ నగరాలపైకి పంపిస్తున్న రష్యా దాడుల్లోనూ పదును పెంచింది. పౌర నివాస సముదాయాలను సైతం రష్యా బాంబులు తాకుతుండడమే అందుకు నిదర్శనం. 

ఖార్కివ్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న నవీన్ ఈ తరహా దాడుల్లోనే మృతి చెందాడు. రష్యా సైనికులు పేల్చిన ఓ షెల్ నవీన్ నివాసం ఉంటున్న భవనాన్ని తాకింది. 

కాగా, ఖార్కివ్ లో 3 వేల నుంచి 4 వేల మంది వరకు భారతీయులు ఉంటారని అంచనా. రష్యా సేనలు ఉక్రెయిన్ లో అంతకంతకు చొచ్చుకుని వస్తుండడం, రష్యా బలగాలు తీవ్రస్థాయిలో దాడులకు దిగుతుండడం వంటి అంశాల నేపథ్యంలో, భారతీయులను అక్కడి నుంచి తరలించడం కేంద్ర ప్రభుత్వానికి పెనుసవాలుగా మారింది.

More Telugu News