Elon Musk: ఉక్రెయిన్ కు స్టార్ లింక్ పరికరాలను పంపించిన ఎలాన్ మస్క్

  • రష్యా దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం
  • కీలక వ్యవస్థలు ధ్వంసం
  • స్టార్ లింక్ పరికరాలు పంపాలన్న ఉక్రెయిన్
  • పెద్దమనసుతో స్పందించిన ఎలాన్ మస్క్
Elon Musk sends Starlink terminals to war torn Ukraine

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధిపతి, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ పెద్ద మనసు చాటుకున్నారు. రష్యా దాడులతో అతలాకుతలమైన ఉక్రెయిన్ కు ఆపన్నహస్తం అందించారు. దేశంలో ఇంటర్నెట్ సేవలకు చేయూతనిచ్చారు. తమ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఉక్రెయిన్ లో వినియోగించుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన టెర్మినల్ పరికరాలను ఉక్రెయిన్ కు అందించారు. 

మస్క్ పంపించిన శాటిలైట్ ఇంటర్నెట్ టెర్మినల్స్ తో కూడిన ట్రక్కు ఫొటోను ఉక్రెయిన్ ఉప ప్రధాని మైఖెలో ఫెదొరోవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కష్టకాలంలో ఆదుకున్నందుకు ఎలాన్ మస్క్ కు ఫెదొరోవ్ కృతజ్ఞతలు తెలిపారు. మోస్ట్ వెల్కమ్ అంటూ మస్క్ ట్విట్టర్ లో బదులిచ్చారు. 

కాగా, రష్యా దాడులతో ఉక్రెయిన్ వ్యవస్థలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ ప్రభుత్వం స్టార్ లింక్ సేవలు అందించాలని, అందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను పంపాలని ఎలాన్ మస్క్ కు విజ్ఞప్తి చేసింది. 

"మీరు అంగారక గ్రహంపై ఆవాసాలు ఏర్పరచుకోవాలని ఎంతో కృషి చేస్తుంటే, ఇక్కడ రష్యా మాత్రం ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోంది. మీ స్పేస్ ఎక్స్ రాకెట్లు అంతరిక్షంలోకి వెళ్లి మళ్లీ విజయవంతంగా తిరిగొస్తుంటే, రష్యా ఇక్కడ ఉక్రెయిన్ పౌరులపై రాకెట్ దాడులు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మాకు స్టార్ లింక్ స్టేషన్లను పంపాలని కోరుతున్నాం" అంటూ ఉక్రెయిన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫెదొరోవ్... ఎలాన్ మస్క్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు మస్క్ వెంటనే స్పందించి సంబంధింత పరికరాలు తరలింపుకు ఆదేశాలు ఇచ్చారు.

More Telugu News