Ukraine: దాడుల్లో తీవ్రత పెంచిన రష్యా... 70 మంది ఉక్రెయిన్ సైనికుల మృతి

  • ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దమనకాండ
  • తాజాగా భారీ ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దించిన పుతిన్
  • ఒకిట్రికా వద్ద రష్యా రాకెట్ దాడులు
  • పౌరులు కూడా చనిపోతున్నారన్న ఉక్రెయిన్
Seventy Ukrainian soldiers died in Russia rocket firings

ఉక్రెయిన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడమే లక్ష్యమని చెబుతున్న రష్యా... ఆ దిశగా దాడులు ముమ్మరం చేసింది. గత కొన్నిరోజులతో పోల్చితే ఇవాళ భారీ ఎత్తున బలగాలను రంగంలో దించింది. దాదాపు రష్యా తన సైన్యంలో సగం బలగాలను ఉక్రెయిన్ రాజధాని కీవ్ దిశగా తరలిస్తున్నట్టు సమాచారం అందుతోంది. అదే సమయంలో ఉక్రెయిన్ లోని ఇతర నగరాలను కూడా చేజిక్కించుకునేందుకు రష్యా బలగాలు భీకర దాడులు జరుపుతున్నాయి. 

ఒకిట్రికా నగరం వద్ద రష్యా బలగాలు జరిపిన ఓ రాకెట్ దాడిలో ఉక్రెయిన్ కు చెందిన 70 మంది సైనికులు మృతి చెందారు. అంతేకాకుండా, పదుల సంఖ్యలో సాధారణ పౌరులు కూడా బలయ్యారని ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, రష్యా దాడులు ప్రారంభించాక ఉక్రెయిన్ లో ఇప్పటివరకు 102 మంది సాధారణ పౌరులు బలైనట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. చనిపోయిన వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నట్టు తెలిపింది. 

కాగా, తమకు ఆయుధాలు ఉంటే చాలని, రష్యాపై పోరాటం ఆపబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మరోసారి స్పష్టం చేశారు. తాజాగా ఆయన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఆయుధాల జాబితా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ జాబితాలో ఉన్న ఆయుధాలను తమకు అందించాలని కోరినట్టు సమాచారం.

More Telugu News