YS Vivekananda Reddy: ఎన్నికల్లో గెలిచేందుకు వివేకా హత్యను జగనే ప్లాన్ చేసినట్టు ఉన్నారు: వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వాంగ్మూలం

ys jagan behind the viveka murder plan said his son in  law
  • కోడికత్తి కేసులో తనకు వైద్యం చేసిన ఇద్దరు వైద్యులకు కీలక పదవులు ఇచ్చారు 
  • జగన్ ఒత్తిడితోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా పోటీ
  • ఎన్నికల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు హైదరాబాద్‌లోని రెండు ఇళ్లు అమ్మేశామన్న రాజశేఖరరెడ్డి 
హత్యను రాజకీయంగా వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వివేకానందరెడ్డి హత్యకు జగనే ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తోందని వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కోడికత్తి కేసులో తనకు వైద్యం చేసిన ఇద్దరు ప్రైవేటు వైద్యులకు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కీలక పదవులు కట్టబెట్టారని గుర్తు చేశారు. వారిలో ఒకరైన డాక్టర్ సాంబశివారెడ్డిని మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌గా నియమిస్తే, డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డిని ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది చైర్మన్‌గా నియమించారని అన్నారు. 

ఆ దాడిలానే ఎన్నికల్లో లబ్ధి పొంది విజయం సాధించేందుకు మా మామ హత్యకు కూడా జగనే పథక రచన చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో కుటుంబసభ్యుల పాత్ర ఉందని కనుక అనుమానించి ఉంటే 2019 ఎన్నికల్లో జగన్, అవినాశ్‌రెడ్డి ఓడిపోయి ఉండేవారని రాజశేఖర్‌రెడ్డి అన్నారు. వివేకా హత్యను రాజకీయాలతో ముడిపెట్టి జగన్ మాట్లాడడం తనకు నచ్చలేదన్నారు. అదే విషయాన్ని ఆ తర్వాత ఆయనకు చెప్పానన్నారు. 

రాజకీయాల నుంచి వైదొలగాలని వివేకా నిర్ణయించుకున్నప్పటికీ జగన్ ఒత్తిడితో 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో తనకంటే బలహీనుడైన బీటెక్ రవి చేతిలో 30 ఓట్ల తేడాతో వివేకా ఓడిపోయారని, ఎందుకలా? అని గంగిరెడ్డిని ప్రశ్నిస్తే వెన్నుపోటే కారణమని అన్నారని గుర్తు చేశారు. కాలేజీలో తనకు జూనియర్ అయిన బీటెక్ రవి.. వివేకా కోసం కాకుండా తన కోసం పనిచేయాలంటూ శివశంకర్ రెడ్డికి  రూ.70 లక్షలు ఇచ్చినట్టు తనతో చెప్పారని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పులు తీర్చేందుకు హైదరాబాద్‌లో రెండు ఇళ్లు, ఒక ఫ్లాటు, హిమాచల్‌ ప్రదేశ్‌లోని జలవిద్యుత్ కేంద్రంలోని 10 శాతం వాటా అమ్ముకోవాల్సి వచ్చిందని అన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయి ఉంటారని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. వివేకా హత్య జరిగిన రోజున కడప మాజీ మేయర్ సురేశ్, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఒక కంప్లయింట్ రాసుకొచ్చి, తన భార్య సునీతతో సంతకం పెట్టమన్నారని, అందులో టీడీపీ నాయకులు సతీశ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి పేర్లను అనుమానితులుగా పేర్కొన్నారని తెలిపారు. 

అయితే, ఆ ఫిర్యాదుపై సంతకం చేసేందుకు సునీత నిరాకరించారని వివరించారు. కేసును రాజకీయం చేస్తున్నారని తెలిసే ఆమె సంతకం చేయలేదని అన్నారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక సిట్‌ను ప్రభుత్వం నీరు కార్చిందని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
YS Vivekananda Reddy
Narreddy Rajasekhar Reddy
Murder Case
Sunitha
YS Jagan

More Telugu News