Chandrababu: యడ్లపాటి నివాసానికి వెళ్లి నివాళి అర్పించిన చంద్రబాబు.. ఆయన ఆశయాలు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య!

  • 103 ఏళ్ల వయసులో కన్నుమూసిన యడ్లపాటి
  • ఆయన మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు
  • ఆయన రాజకీయ జీవితం ఆదర్శప్రాయమని వ్యాఖ్య
Chandrababu pays condolences to Yadlapati

టీడీపీ సీనియర్ నాయకుడు యడ్లపాటి వెంకట్రావు (103) కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని తన కూతురు నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాసేపటి క్రితం ఆయన నివాసానికి వెళ్లి, యడ్లపాటి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. 

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ దురంధరులు యడ్లపాటి వెంకట్రావు మృతి బాధాకరమని చెప్పారు. ప్రజలకు ఎలా సేవ చేయాలనేది యడ్లపాటి నుంచి నేర్చుకోవచ్చని చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన యడ్లపాటి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. రైతు నాయకుడిగా ఎనలేని సేవ చేశారని కితాబునిచ్చారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి రాజకీయ జీవితం ఆదర్శప్రాయంగా సాగిందని చెప్పారు. 

రాష్ట్ర మంత్రిగా, జడ్పీ ఛైర్మన్ గా, రాజ్యసభ సభ్యునిగా ఆయన ఎంతో సేవ చేశారని అన్నారు. తాను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉందని చెప్పారు. ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే వన్నె తెచ్చారని అన్నారు. ఆయన ఆశయాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయని చెప్పారు. యడ్లపాటి అజాత శత్రువని కొనియాడారు.

More Telugu News