Russia: కీవ్ అణుధార్మిక వ్యర్థాల ప్లాంట్ పై రష్యా రాకెట్ దాడి.. అణుధార్మికత అనుమానాలు!

  • రేడాన్ సంస్థపై క్షిపణులు ప్రయోగించిన రష్యా
  • రేడియేషన్ ను గుర్తించే ఆటోమేటిక్ వ్యవస్థ నాశనం
  • రష్యా, ఉక్రెయిన్ దళాల మధ్య భీకరపోరు
Russia Missile Attack On Radio Active Waste Disposal Site

కీవ్ పై దాడులను రష్యా మరింత తీవ్రం చేస్తోంది. వందలాది క్షిపణులు, రాకెట్లను ప్రయోగిస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. అయితే, ఆ దాడులకు అంతే దీటుగా ఉక్రెయిన్ కూడా బదులిస్తోంది. కాగా, ఇవాళ ఉదయం కీవ్ కు ఆవల ఉన్న అణు ధార్మిక వ్యర్థాలను విచ్ఛిన్నం చేసే కేంద్రంపై రష్యా రాకెట్ దాడికి పాల్పడింది. ప్రభుత్వ అధీనంలోని ‘రేడాన్’ అనే రేడియో యాక్టివ్ డిస్పోజల్ సైట్ ను ధ్వంసం చేసింది. 

దాడి ఘటనను రేడాన్ సంస్థ ప్రతినిధులు అధికారులకు ఫోన్ల ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం వారంతా షెల్టర్లలో ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కాల్పులు, ప్రతిదాడులతో దద్దరిల్లిపోతోంది. దీంతో అక్కడ నష్టమెంత అన్నదానిపై అధికారులు తేల్చలేకపోతున్నారు. అణుధార్మికతను గుర్తించే ఆటోమేటిక్ వ్యవస్థ పనిచేయకుండా ఆగిపోయింది. క్షిపణులు పడుతున్న దానిని అక్కడి సీసీటీవీ కెమెరాలు రికార్డ్ చేశాయి. దాడులు, ప్రతిదాడులు ముగిసిన తర్వాత పోర్టబుల్ పరికరాల ద్వారా అక్కడి అణుధార్మికతను గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు. ఎస్ఎన్ఆర్ఐయూ అంచనాల ప్రకారం.. రేడాన్ కు ఆవల ఉన్న ప్రాంతంలోని ప్రజలకు రేడియేషన్ ముప్పు లేదని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

More Telugu News