YS Vivekananda Reddy: వివేకానందరెడ్డి హత్యను నాపై వేసుకుంటే రూ. 10 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు: సీబీఐ వాంగ్మూలంలో గంగాధర్‌రెడ్డి

  • అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి గంగాధర్‌రెడ్డి సన్నిహితుడు
  • ఫోన్ చేసి రమ్మంటే పులివెందులకు 8 కి.మీ. దూరంలో గోదాము వద్దకు వెళ్లా
  • మరో ఇద్దరుముగ్గురితో కలిసి వివేకాను చంపినట్టు ఒప్పుకోమన్నారు
  • జగన్ సొంతబాబాయి విషయం కావడంతో తిరస్కరించా
They Offer me Rs 10 crore if he agree that he killed vivekananda reddy

ఏపీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా సీబీఐకి నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, పులివెందులకు చెందిన కల్లూరి గంగాధర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం బయటకు వచ్చింది. అవినాశ్‌‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలకు గంగాధర్‌రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. గతేడాది అక్టోబరు 2న ఆయన సీబీఐ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అవినాశ్‌రెడ్డి, ఆయన కుటుంబంతో వివేకానందరెడ్డికి శత్రుత్వం ఉందని, వివేకా అనుచరులు అవినాశ్‌రెడ్డిని, భాస్కర్‌రెడ్డిని, వారి కుటుంబాన్ని, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని పట్టించుకునేవారు కాదని చెప్పారు. దీంతో వారంతా కలిసి వివేకాను హత్య చేయాలని భావించారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. 

2019 ఆగస్టు చివరిలో శివశంకర్‌రెడ్డి తన వాట్సాప్ నంబరుకు కాల్ చేసి మాట్లాడాల్సి ఉందని, అర్జెంటుగా పులివెందులకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదాము వద్దకు రావాలని చెబితే వెళ్లానని, అప్పటికే అక్కడున్న అవినాశ్‌రెడ్డి పీఏ రమణారెడ్డి తన ఫోన్ తీసుకుని మొదటి అంతస్తుకు వెళ్లాలని చెబితే వెళ్లానని చెప్పారు. అక్కడ తన బాగోగులు గురించి ఆరా తీసిన తర్వాత తన భార్యకు తిరుపతిలో ఉద్యోగం ఇప్పించాలని కోరానని చెప్పారు.

ఉద్యోగం గురించి ఆందోళన అవసరం లేదని, మంచి ఆఫర్ ఇస్తానని చెప్పారని గుర్తు చేసుకున్నారు. మరో ఇద్దరుముగ్గురితో కలిసి వివేకానందరెడ్డి హత్య నేరాన్ని తనపై వేసుకుంటే రూ. 10 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. సిట్ అధికారుల ఎదుట నేరాన్ని అంగీకరించాలని కోరారని అన్నారు. అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డితో కలిసి ప్లాన్ చేసి కొత్త వాళ్లతో వివేకాను చంపించామని, హత్య చేసిన వారిని పోలీసులు విచారిస్తే, వారు కనుక నిజం చెప్పేస్తే తనతోపాటు మిగతావారు ఇబ్బందుల్లో పడతామని ఆందోళన వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. అయితే, ఇది జగన్ సొంత బాబాయ్ విషయం కావడంతో ఏదైనా తేడా వస్తే తాను ఇబ్బందుల్లో పడతానన్న ఉద్దేశంతో శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు గంగాధర్‌రెడ్డి తన వాంగ్మూలంలో వివరించారు.

More Telugu News