Andhra Pradesh: ఏపీలో కొత్త జిల్లాల‌కు ఉద్యోగుల‌ కేటాయింపున‌కై గైడ్ లైన్స్ జారీ

Issuance of guidelines for allocation of employees to new districts in AP
  • ఏప్రిల్ 2 కొత్త జిల్లాలకు అపాయింటెండ్ డేట్‌
  • పోలీసు శాఖ మిన‌హా మిగిలిన శాఖ‌ల ఉద్యోగుల పునర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌
  • జిల్లా, డివిజ‌న్ స్థాయి ఉద్యోగుల వ‌ర‌కే మార్పులు చేర్పులు
ఏపీలో ఏప్రిల్ 2 నుంచి అందుబాటులోకి రానున్న‌ కొత్త జిల్లాల్లో పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం సమాయత్త‌మవుతోంది. అందులో భాగంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల కేటాయింపు, పోస్టుల విభజనకు సంబంధించి మార్గదర్శకాలను శ‌నివారం సాయంత్రం జారీ చేసింది. 

కొత్త జిల్లాల్లో ఈ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు ఆప్షన్ ఫార్మ్ లను జారీ చేసింది. సీఎస్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీ వీటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందనీ, ఏప్రిల్ 2 ఉగాది నాటి నుంచి కొత్త జిల్లాల్లోని పునర్వ్యవస్థీకరించిన ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లు పనిచేయడం ప్రారంభిస్తాయని ప్ర‌భుత్వం స‌ద‌రు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. 

ఏప్రిల్ 2ను జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అప్పాయింటెడ్ డే గా పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా వనరులు, ఉద్యోగుల శాశ్వత విభజనకు కొంత సమయం పడుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజిన్లలో ప్రభుత్వ విధులు సాఫీగా జరిగేందుకు తాత్కాలికంగా ఉద్యోగులు, పోస్టులు, వనరుల కేటాయింపు అవసరమని స్పష్టం చేసింది. 

తాత్కాలిక కేటాయింపుల కోసం రాష్ట్ర, ప్రాంతీయ, జోనల్, మండల, గ్రామ స్థాయిలోని కార్యాలయాలు, పోస్టుల విభజన, కేటాయింపు ఉండబోదని స్పష్టం చేసింది. జిల్లా, డివిజన్ స్థాయిలోని ఉద్యోగులకు మాత్రమే తాత్కాలిక ప్రాతిపదికన కేటాయింపు ఉంటుందని తెలిపింది. ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల అంశాన్ని ఆర్ధిక శాఖ పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. 

ఏపీ పోలీసు విభాగం మినహా మిగతా ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు కొత్త జిల్లాలు, డివిజన్లకు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయని ప్ర‌భుత్వం తెలిపింది. మార్చి 11 తేదీ నాటికి ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల జాబితా సిద్ధమవుతుందని పేర్కొంది. తుది జాబితాకు అనుగుణంగా ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు స్పష్టం చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
Andhra Pradesh
new districts

More Telugu News