Ukraine: ఉక్రెయిన్ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరించిన తెలుగు విద్యార్థి

Telugu student explains Ukraine conditions
  • ఉక్రెయిన్ పై రష్యా దాడి
  • ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు
  • గడ్డకట్టించే చలిలో తీవ్ర ఇక్కట్లు
  • తిండికోసం అలమటిస్తున్న వైనం
ఉక్రెయిన్ లో ప్రస్తుతం కల్లోలభరిత పరిస్థితులు కనిపిస్తున్నాయి. రష్యా దాడుల నేపథ్యంలో, ముఖ్యంగా భారత విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. స్వదేశానికి వచ్చేందుకు ఎంతో వేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ నగరం ల్వీవ్ లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు యువకుడు విష్ణు అక్కడి పరిస్థితులను వివరించాడు. 

కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తాము యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోవాల్సి వచ్చిందని అన్నాడు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తుందని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయని, తాము వెళ్లిపోతామని చెప్పినా కాలేజీ యాజమాన్యం అంగీకరించలేదని వాపోయాడు. ఇక యుద్ధం ప్రారంభమైన తర్వాత సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారని, అప్పటికే బయట చూస్తే పరిస్థితులు దారుణంగా ఉన్నాయని విష్ణు తెలిపాడు. 

షాపులు మూసివేయడంతో ఆహారం కోసం అలమటించామని తెలిపాడు. ఒక పూట కడుపు నింపుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని వివరించాడు. తనతో పాటు కేరళకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారని, అయితే భారత్ కు తిరిగి వెళ్లే క్రమంలో తమను పోలెండ్ సరిహద్దుల వద్దకు చేరుకోవాలని ఎంబసీ అధికారులు సూచించారని వెల్లడించాడు. 

"ఉక్రెయిన్ లో గడ్డకట్టించే చలి. మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అలాంటి వాతావరణంలో ఓ బస్సు కోసం 30 కిలోమీటర్లు నడిచాం. నడవలేక క్యాబ్ లు మాట్లాడుకుంటే వాళ్లు అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారు. ఏటీఎంలలో డబ్బులు రాకపోవడంతో, క్యాబ్ లకు అధిక మొత్తం చెల్లించలేక చాలామంది విద్యార్థులు కాలినడకనే పోలెండ్ సరిహద్దుకు పయనమయ్యారు. 

మాతో పాటు కొందరు మహిళా విద్యార్థులు ఉండడంతో వారిని పోలెండ్ సరిహద్దు వద్ద ఓ భవనంలో ఉంచి మేం బయట ఉన్నాం. ఎటు నుంచి ఏ దాడి జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడిపాం. తిండిలేదు, నీళ్లు లేవు. మమ్మల్ని వీలైనంత త్వరగా తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని విష్ణు ఓ తెలుగు మీడియా సంస్థతో తమ గోడు వెళ్లబోసుకున్నాడు.
Ukraine
Telugu Students
AP
Telangana
Russia
War

More Telugu News