Russia: మాది శక్తిమంతమైన అణ్వస్త్ర దేశం, జాగ్రత్త.. అణుదాడిపై రష్యా అధ్యక్షుడి పరోక్ష హెచ్చరికలు

  • జోక్యం చేసుకుంటే వినాశకర పరిస్థితులంటూ ఇటీవల వార్నింగ్
  • అందుకే వెనకడుగు వేసిన జో బైడెన్
  • సైనిక సాయం చేయలేమంటూ ఉక్రెయిన్ కు స్పష్టీకరణ
Russia President Warns Nuclear War

అణ్వాయుధ యుద్ధమంటూ వస్తే అది మూడో ప్రపంచ యుద్ధమేనన్నది జగమెరిగిన సత్యం. దాదాపు అన్ని దేశాలూ అణ్వస్త్రాలకు దూరంగానే ఉన్నాయి. వాటి తయారీ, పరీక్షలనూ నిలిపేశాయి. అయితే, అందుకు ఉత్తరకొరియా మినహాయింపు. ఎప్పటికప్పుడు అణ్వాయుధాలను తయారు చేసుకుంటూ, వాటిని పరీక్షిస్తూ అమెరికాకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది ఆ చిన్న దేశం. 

ఇప్పుడు తాజాగా రష్యా కూడా అమెరికాకు పరోక్షంగా అణ్వాయుధ హెచ్చరికలు చేసింది. ఇటీవల ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటన సందర్భంలో ఉక్రెయిన్ కు అండగా వచ్చే దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రమైన హెచ్చరికలు చేశారు. తమ వద్ద అణ్వాయుధాలున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ అమెరికాకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. 

‘‘మేం సోవియట్ యూనియన్ నుంచి విచ్ఛిన్నమైపోయినా ఇంకా అత్యంత శక్తిమంతమైన సామ్రాజ్యమే. మా దగ్గర అత్యంత శక్తిమంతమైన అణ్వస్త్రాలు, ఇతర ఆయుధాలూ ఉన్నాయని గుర్తుంచుకోండి. ఎవరైనా అడ్డొస్తే వినాశకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ఆయన హెచ్చరించారు. అంటే ఉక్రెయిన్ పై తమ దాడులకు ప్రతిగా తమ దేశంపై వేరే ఏ దేశమైనా సైనిక దాడికి దిగితే అణు దాడి చేస్తామంటూ ఆయన పరోక్ష బెదిరింపులకు పాల్పడ్డారు. 

ఆ భయం వల్లే ఉక్రెయిన్ కు మాట సాయం తప్ప సైనిక సాయం చేయలేమంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెనకడుగు వేశారు. నాటో బలగాలు ఉక్రెయిన్ కు మద్దతుగా యుద్ధానికి దిగితే.. రష్యా, నాటో మధ్య అణ్వాయుధ యుద్ధం జరిగే ముప్పుంటుందని ఆయన ముందే గుర్తించారు. అయితే నాటో మీద కావాలని దాడికి దిగితే మాత్రం రష్యాకు తీవ్రమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. 

వాస్తవానికి ఉక్రెయిన్ ను తాము ఆక్రమించుకోవడానికి దాడి చేయడం లేదని, కేవలం డీ మిలటరైజేషన్ (నిస్సైనికీకరణ) కోసమేనని పుతిన్ చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత మళ్లీ రష్యాకు పునర్వైభవం తెచ్చేందుకే ఇలాంటి చర్యలకు పుతిన్ దిగుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

2014లో క్రిమియాను రష్యాలో కలిపేసుకున్నట్టుగానే ఉక్రెయిన్ నూ రష్యాలో భాగం చేసుకునే అవకాశాలూ లేకపోలేదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లోని తోలుబొమ్మ ప్రభుత్వాన్ని దించేయాలంటూ ఉక్రెయిన్ సైన్యానికి పుతిన్ నిన్న పిలుపునిచ్చారు. అంటే ఆ దేశాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారనడంలో సందేహం లేదు. అందుకే పాశ్చాత్య దేశాలు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా అణు హెచ్చరికలు చేశారన్న భాష్యాలు వినిపిస్తున్నాయి. 

ఇటు నాటోలో చేరకూడదంటూ స్వీడన్, ఫిన్లాండ్ లనూ రష్యా తాజాగా హెచ్చరించింది. ఉక్రెయిన్ కు పట్టిన గతే పడుతుందంటూ బెదిరించింది. దానికీ కారణం లేకపోలేదు. ఇప్పటికే రష్యా చుట్టూ ఉన్న దేశాల్లో నాటో బలగాల మోహరింపులు ఎక్కువైపోయాయి. ఓ రకంగా రష్యా కార్యకలాపాలపై కన్నేసి ఉంచేందుకు ప్రపంచ అతిపెద్ద దేశాన్ని దాదాపు చుట్టుముట్టేశాయి. 

ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సహా రష్యాకు సరిహద్దుల్లో ఉన్న మరికొన్ని దేశాలనూ నాటోలో కలుపుకునేందుకు అమెరికా ఉవ్విళ్లూరుతోంది. నాటోలో ఇన్ని దేశాలే ఉండాలన్న పరిమితులేం లేవని, ఎన్ని దేశాలైనా చేరొచ్చంటూ ఇటీవల ప్రకటన కూడా చేసింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఏ దేశాన్నీ తమపై దాడికి ఉసిగొల్పకుండా ఉండడం కోసమే పుతిన్ అణ్వాయుధ ప్రస్తావన తీసుకొచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యాఖ్యలను అమెరికా, యూరప్ దేశాలు లైట్ గా తీసుకుంటే మాత్రం పరిస్థితి తలకిందులైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. అందుకు లేదు..లేదు అంటూనే ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగిన ఉదంతాలను ప్రస్తావిస్తున్నారు.

More Telugu News