Ukraine: ఉక్రెయిన్ బోర్డర్ పాయింట్లకు నడుచుకుంటూ వెళ్తున్న భారతీయులు.. కీలక హెచ్చరిక జారీ చేసిన ఇండియన్ ఎంబసీ!

  • సమాచారం ఇవ్వకుండా బోర్డర్ పాయింట్లకు వెళ్లొద్దు
  • అలా వెళ్తే సహాయం చేయడం కష్టతరంగా మారుతుంది
  • పలు బోర్డర్ పాయింట్ల వద్ద పరిస్థితి బాగోలేదు
Indian Embassy in Ukraine warns Indians not to go to border points without giving information

ఉక్రెయిన్ పై దాడిని రష్యా ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఆక్రమించుకోవడమే లక్ష్యంగా రష్యన్ బలగాలు సాగుతున్నాయి. ఉక్రెయిన్ బలగాలు కూడా శక్తివంచన లేకుండా రష్యన్ బలగాలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. రష్యన్ దాడుల్లో ఎంతో మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. 

పరిస్థితులు దారుణంగా మారిపోయిన నేపథ్యంలో అక్కడున్న మన దేశ ప్రజలకు ఇండియన్ ఎంబసీ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకోకుండా ఏ బోర్డర్ పోస్టుకు వెళ్లవద్దని సూచించింది. పలు బోర్డర్ చెక్ పాయింట్ల వద్ద పరిస్థితి బాగోలేదని తెలిపింది. 

మన పౌరులను ఉక్రెయిన్ నుంచి తరలించేందుకు సరిహద్దు దేశాల ఎంబసీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. సమాచారం అందించకుండానే బోర్డర్ చెక్ పాయింట్లకు చేరుకున్న భారతీయులకు సహాయం అందించడం క్రమంగా మరింత కష్టతరంగా మారుతోందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఎంబసీ అధికారులకు సమాచారం అందించకుండా బోర్డర్ పాయింట్లకు వెళ్లవద్దని సూచించింది. 

ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. చాలా మంది బంకర్లలోకి వెళ్లిపోయారు. ఎంతోమంది సుదూరంగా ఉన్న బోర్డర్ పాయింట్లకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే  ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ ఈ ప్రకటన చేసింది.

More Telugu News