YS Vivekananda Reddy: వివేకానందరెడ్డి అంటే అవినాశ్ కు కుళ్లు: వాంగ్మూలంలో అవినాశ్ రెడ్డి పెదనాన్న ప్రతాప్‌రెడ్డి

They never accept ys vivekanandareddy said ys pratap Reddy in statement
  • వివేకా ఇంటి వద్ద పరిస్థితి చూసి ఏదో తేడాగా ఉందని గ్రహించా
  • అయితే, అప్పటికే ఆ నలుగురూ గుండెపోటు అని ప్రచారం చేశారు
  • 2017లో ఎమ్మెల్సీగా పోటీచేసిన వివేకాను ఆ నలుగురూ కలిసి ఓడించారు
  • ఆధారాలను ధ్వంసం చేయడం తనకు నచ్చలేదన్నా ప్రతాప్ రెడ్డి 
ఏపీ మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి పలువురు నిందితులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా, అవినాశ్ రెడ్డి, పెదనాన్న, వైఎస్ భాస్కరరెడ్డి సోదరుడు వైఎస్ ప్రతాప్‌రెడ్డి వాంగ్మూలం బయటకు వచ్చింది. వివేకానందరెడ్డి అంటే అవినాశ్ రెడ్డికి, ఆయన తండ్రి భాస్కరరెడ్డికి చెప్పలేనంత ఈర్ష్యగా ఉండేదని ఆ వాంగ్మూలంలో ఆయన పేర్కొన్నారు.

వివేకాను భాస్కర్‌రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకిగానే చూసేవారని అన్నారు. తన వద్దకు వచ్చి గోడు వినిపించుకునే వారి సమస్యలను వివేకా పరిష్కరించేవారని, దీంతో తమకంటే ఆయనకే ప్రజల్లో మంచి పేరు ఉందని వీరిద్దరూ అసూయ పడేవారని పేర్కొన్నారు. చివరికి శత్రువులు కూడా వివేకాను గౌరవించేవారని అన్నారు. 

2019 ఎన్నికల్లో కడప టికెట్‌ను విజయమ్మకు లేదంటే షర్మిలకు ఇస్తే బాగుండేదన్న అభిప్రాయంతో వివేకా ఉండేవారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గానికి అవినాశ్ రెడ్డి మంచి అభ్యర్థి అవుతాడని కూడా వివేకా చెప్పేవారని ప్రతాప్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. 

15 మార్చి 2019న ఉదయం 6.50 గంటల సమయంలో తన సోదరుడు వైఎస్ మనోహర్‌రెడ్డి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటు, రక్తపు వాంతులతో మరణించారని చెబితే అక్కడికి వెళ్లానని, అయితే, అక్కడి పరిస్థితి చూసి ఏదో తేడా ఉందని గుర్తించానని చెప్పారు. వివేకా గుండెపోటుతో మరణించలేదని తనకు అర్థమైందన్నారు. అయితే, అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్టు అవినాశ్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ప్రచారం చేయడంతో తన అభిప్రాయాన్ని ఎవరి వద్దా వ్యక్తం చేయలేదని వివరించారు. 

అంతేకాదు, 2017 ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన వివేకాను భాస్కర్‌రెడ్డి, అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కలిసి ఓడించారని చెప్పారు. వారివల్లే తాను ఓడినట్టు వివేకానందరెడ్డి కూడా ఆ తర్వాత తెలుసుకున్నారని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. వివేకానందరెడ్డిది హత్యేనని స్పష్టంగా తెలుస్తున్నా, దానిని గుండెపోటుగా చిత్రీకరించేందుకు ఆధారాలను ధ్వంసం చేయడం తనకు నచ్చలేదని అన్నారు. 

శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి కలిసి ఆధారాలను ధ్వంసం చేశారని, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి పదేపదే బెడ్‌‌రూముకు, బయటకు తిరుగుతూ కనిపించారని అన్నారు. వివేకా గుండెపోటుతో మరణించారన్న సిద్ధాంతాన్ని మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి తెరపైకి ఎందుకు తెచ్చారన్న సంగతి తనకు అర్థం కాలేదన్నారు.
YS Vivekananda Reddy
YS Avinash Reddy
YS Pratap Reddy
Murder Case

More Telugu News