IPL-2022: ఐపీఎల్-2022 సీజన్ పై కీలక నిర్ణయాలు తీసుకున్న పాలకమండలి

  • మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్
  • 4 వేదికల్లో 70 లీగ్ మ్యాచ్ ల నిర్వహణ
  • ప్లే ఆఫ్ వేదికలు త్వరలో ప్రకటించనున్న బీసీసీఐ
  • మే 29న ఫైనల్ మ్యాచ్
IPL Governing Council key decisions for new season

ఐపీఎల్ పాలకమండలి నేడు కీలక సమావేశం నిర్వహించింది. ఇటీవలే ఐపీఎల్ 15వ సీజన్ కోసం ఆటగాళ్ల మెగా వేలం పూర్తవగా, ఇక అందరి దృష్టి లీగ్ పోటీల నిర్వహణపై పడింది. దేశంలో కరోనా పరిస్థితులు కొనసాగుతుండడంతో ఐపీఎల్ పాలకమండలి నేటి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ తాజా సీజన్ ను మార్చి 26 నుంచి జరపనున్నారు. ఫైనల్ మ్యాచ్ మే 29న నిర్వహిస్తారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ముంబయి, పూణే నగరాల్లోని 4 వేదికల్లోనే మ్యాచ్ లు జరపాలని నిర్ణయించారు. ఈ సీజన్ లో మొత్తం 10 జట్లు ఆడనుండగా, 70 లీగ్  మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడుతుంది. ప్లే ఆఫ్ మ్యాచ్ ల వేదికలను తర్వాత ప్రకటిస్తారు. లీగ్ మ్యాచ్ లను ముంబయిలోని వాంఖెడే, డీవై పాటిల్, బ్రాబౌర్న్ స్టేడియంలలోను, పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలోనూ నిర్వహిస్తారు.

కాగా, ఈసారి ఐపీఎల్ లో ఆయా జట్లను రెండు వర్చువల్ గ్రూపులుగా విభజించారు. ఒక్కో జట్టు ఐపీఎల్ లో ఎన్ని టైటిళ్లు గెలిచిందన్న గణాంకాల ఆధారంగా వాటికి గ్రూపుల్లో స్థానాలు కేటాయించారు. దీని ప్రకారం గ్రూప్-ఏలో ముంబయి (5 టైటిళ్లు), కోల్ కతా (2), రాజస్థాన్ రాయల్స్ (1), ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్ జట్లు ఉన్నాయి.

ఇక గ్రూప్-బిలో చెన్నై సూపర్ కింగ్స్ (4 టైటిళ్లు), సన్ రైజర్స్ హైదరాబాద్ (1), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి.

ఒక్కో జట్టు తమ గ్రూపులోని జట్లతో రెండేసి సార్లు తలపడుతుంది. అనంతరం, ఎదుటి గ్రూపులో తన ర్యాంకుకు సమానంగా ఉన్న జట్టుతో రెండు మ్యాచ్ లు, ఆ గ్రూపులోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.

ఉదాహరణకు గ్రూప్-ఏలో టాప్ లో ఉన్న ముంబయి జట్టు తన గ్రూప్ లో అన్ని జట్లతో రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. అదే సమయంలో, గ్రూప్-బిలో టాప్ లో ఉన్న చెన్నై జట్టుతో ముంబయి రెండు మ్యాచ్ లు ఆడి, ఆ గ్రూప్ లో ఉన్న మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.

ప్రతి జట్టు తన వ్యతిరేక గ్రూపులో తన ర్యాంకుకు అత్యంత చేరువలో ఉన్న జట్టుతో ఇదే విధంగా రెండు మ్యాచ్ లు, మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.

More Telugu News