Oleksiii Reznikov: మీకు తుపాకీ పట్టుకోవడం వచ్చా... అయితే సైన్యంలో చేరండి: సాధారణ పౌరులకు ఉక్రెయిన్ రక్షణ మంత్రి పిలుపు

Ukraine defense minister Oleksii Reznikov calls people to join territorial army
  • ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా
  • రష్యాను ఎదుర్కునే ప్రయత్నాలలో ఉక్రెయిన్ 
  • టెరిటోరియల్ ఆర్మీలో తాజా రిక్రూట్ మెంట్
  • సైన్యానికి వెన్నుదన్నుగా టెరిటోరియల్ ఆర్మీ
ప్రపంచ దేశాల భయాలను నిజం చేస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై ఆక్రమణకు దిగడం తెలిసిందే. ఇవాళ రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. ఉక్రెయిన్ బలగాలు పెద్దగా ప్రతిఘటించకుండానే లొంగిపోతున్నట్టు వార్తలొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ ఆసక్తికర ప్రకటన చేశారు. దేశం కోసం పోరాడాలన్న కోరిక ఉండి, తుపాకీ పట్టుకోవడం చేతనైన వాళ్లు ఎవరైనా సైన్యంలోకి రావొచ్చని పిలుపునిచ్చారు. రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్ ప్రాదేశిక భద్రతా బలగాల్లో సాధారణ పౌరులు కూడా చేరొచ్చని స్పష్టం చేశారు.

ఉక్రెయిన్ ప్రధాన సైన్యానికి అనుబంధంగా ప్రాదేశిక భద్రతా బలగాలు (టెరిటోరియల్ ఆర్మీ దళాలు) పనిచేస్తుంటాయి. అత్యవసర సమయాల్లో సైన్యానికి వెన్నుదన్నుగా ఈ ప్రాదేశిక దళాలు కూడా సేవలు అందిస్తుంటాయి. ఇందులో వివిధ రంగాలకు చెందిన వారు చేరే వీలుంటుంది. చేతివృత్తులవారు, టెక్ నిపుణులు, క్రీడాకారులు... ఎవరైనా చేరొచ్చు. తద్వారా దేశానికి సేవ చేసుకునే అవకాశాన్ని సాధారణ పౌరులకు కల్పిస్తుంటారు.

ఇప్పుడు రష్యా రూపంలో ఉక్రెయిన్ కు అతి పెద్ద ముప్పు ఎదురుకావడంతో రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ తాజా ప్రకటన చేశారు. కాగా, తమ నగరాలపై రష్యా తీవ్రస్థాయిలో బాంబు దాడులు జరుపుతోందని, ఉక్రెయిన్ బలగాలు రష్యా దాడులను తిప్పికొడుతున్నాయని రెజ్నికోవ్ తెలిపారు. తమ సైనిక నిర్వహణ కేంద్రాలను, ఎయిర్ పోర్టులను దెబ్బతీసే లక్ష్యంతో రష్యా దాడులు కొనసాగుతున్నాయని వివరించారు.
Oleksiii Reznikov
Territorial Forces
Ukraine
Russia
War

More Telugu News