BJP: హైదరాబాద్‌లో సమావేశమైన బీజేపీ అసంతృప్త నేతలపై అధిష్ఠానం సీరియస్!

BJP High Command ready to take a action against rebal leaders
  • అసంతృప్త నేతల సమావేశాలంటూ వార్తలు
  • చర్యలు తీసుకోవాలంటూ కోర్ కమిటీల తీర్మానం
  • షోకాజ్ నోటీసులు పంపే యోచనలో తెలంగాణ బీజేపీ
  • వివరణ సంతృప్తికరంగా లేకుంటే వేటే

హైదరాబాద్‌లో సమావేశమైన బీజేపీ అసంతృప్త నేతలపై బీజేపీ అధిష్ఠానం గుర్రుగా ఉంది. వీరిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరో ఒకటి రెండు రోజుల్లో సమావేశంలో పాల్గొన్న అందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని యోచిస్తోంది. వారిచ్చే వివరణ సరిగా లేకుంటే కనుక వేటు వేయడం తప్పదని సమాచారం. అధిష్ఠానం ఆదేశాలతో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వీరిపై క్రమశిక్షణ చర్యలు చేపడతారు.

కరీంనగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేత సుగుణాకర్‌రావు అసంతృప్త నేతలతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారని, వారిని పార్టీ  నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన కోర్ కమిటీలు తీర్మానం చేసి, దానిని జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు పంపాయి. వారిపై చర్యలు తీసుకోకుంటే కనుక పార్టీకి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అందులో పేర్కొన్నారు.

దీనికి స్పందించిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ అసంతృప్త నేతలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను కోరినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు, పార్టీకి వ్యతిరేకంగా తాము సమావేశం నిర్వహించినట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని, కొందరు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని గుజ్జుల రామకృష్ణారెడ్డి, చింతా సాంబమూర్తి, పాపారావు పేర్కొన్నారు. ఆ వార్తలను తాము ఖండిస్తున్నామని, పార్టీ సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉన్నామని, పార్టీ కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News