namaste telangana: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు లోక్‌సభ నోటీసులు

  • రాష్ట్ర విభ‌జ‌న‌పై స‌భ‌లో ప్ర‌ధాని వ్యాఖ్య‌లు
  • ఆ వ్యాఖ్య‌ల‌ను ప‌త్రిక‌లు త‌ప్పుగా రాశాయ‌ని ఎంపీ అర‌వింద్ ఫిర్యాదు
  • స్పీక‌ర్ ఆదేశంతో స‌భా హ‌క్కుల క‌మిటీ ప‌రిశీల‌న‌, నోటీసుల జారీ
  • 72 గంట‌ల్లోగా నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని ఆదేశం
Lok Sabha Rights Committee notices to Namaste Telangana and Telangana Today

తెలంగాణ‌లో ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లుగా గుర్తింపు పొందిన న‌మ‌స్తే తెలంగాణ‌, తెలంగాణ టుడే ప‌త్రిక‌ల‌కు లోక్ స‌భ నోటీసులు జారీ అయ్యాయి. లోక్ స‌భ‌కు చెందిన స‌భా హ‌క్కులు, నైతిక విలువ‌ల విభాగం మంగ‌ళ‌వారం నాడు ఈ రెండు ప‌త్రిక‌ల‌కు నోటీసులు జారీ చేసింది.

బీజేపీ యువ నేత‌, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ ఫిర్యాదు మేర‌కే ఈ నోటీసులు జారీ అయ్యాయి. లోక్ స‌భ వ్య‌వ‌హారాల‌పై త‌ప్పుడు క‌థ‌నాలు రాయ‌డం ద్వారా స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు, స‌భ ధిక్కారానికి ఈ ప‌త్రిక‌లు పాల్ప‌డ్డాయ‌ని అర‌వింద్ చేసిన ఫిర్యాదు ఆధారంగానే ఈ నోటీసులు జారీ అయ్యాయి.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జ‌రిగిన‌ చర్చకు సమాధానమిచ్చిన సంద‌ర్భంగా ప్రధాని న‌రేంద్ర‌ మోదీ ఈ నెల 8న పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనపై కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలను, సభా వ్యవహారాలను నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు వక్రీకరించాయని, తప్పుగా ప్రచురించాయని ఆరోపిస్తూ స్పీకర్‌ ఓం బిర్లాకు అరవింద్‌ ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును స్పీకర్‌.. సభా హక్కుల కమిటీకి పంపించారు. దీనిని ప‌రిశీలించిన క‌మిటీ రెండు ప‌త్రిక‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల‌కు 72 గంటల్లోగా స‌మాధానం ఇవ్వాలని ఆ రెండు పత్రికల సంపాదకులను ఆదేశించింది.

More Telugu News