The Indian Cricketers Association: వృద్ధిమాన్ సాహాకు బెదిరింపులపై భారత క్రికెటర్ల సంఘం స్పందన

  • ఇంటర్వ్యూ కోసం సాహాను బెదిరించిన జర్నలిస్టు
  • స్క్రీన్ షాట్లు తీసి సంభాషణ పంచుకున్న సాహా
  • స్పందించిన ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్
  • ఆ జర్నలిస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డుకు విజ్ఞప్తి
Indian cricketers association statement on Saha issue

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ వృద్ధిమాన్ సాహాకు ఇటీవల ఓ జర్నలిస్టు నుంచి బెదిరింపులు ఎదురవడం తెలిసిందే. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు తనను ఆ జర్నలిస్టు బెదిరించిన తీరును సాహా స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీనిపై భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) స్పందించింది. వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ వృద్ధిమాన్ సాహాకు ఓ సీనియర్ జర్నలిస్టు నుంచి వచ్చిన బెదిరింపుల సందేశాన్ని తాము ఖండిస్తున్నట్టు ఐసీఏ వెల్లడించింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపింది.

ఆ జర్నలిస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని, బీసీసీఐకి సంబంధించిన అన్ని ఈవెంట్లకు అతడు హాజరు కాకుండా అక్రిడిటేషన్ ను రద్దు చేయాలని ఐసీయే కోరింది. క్రికెట్ క్రీడ అభ్యున్నతికి, క్రికెటర్ల ఎదుగుదలలోనూ మీడియా ప్రాతికేయుల పాత్ర ఎంతో ప్రధానమైనదని పేర్కొంది. అయితే, ఎప్పటికీ దాటరాని ఓ హద్దు అనేది ఉంటుందని, దాన్ని సదరు జర్నలిస్టు దాటాడని భావిస్తున్నామని స్పష్టం చేసింది. సాహా విషయంలో జరిగింది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.

పాత్రికేయ సంఘాలకు కూడా దీనిపై సమాచారం అందించామని, ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూడాలని కోరామని ఆటగాళ్ల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరిస్థితుల్లో సాహాకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించింది.  మీడియా వ్యక్తులు కావొచ్చు, మరెవరైనా కావొచ్చు... ఏ ఆటగాడి పట్ల కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడరాదు అని ఐసీయే హితవు పలికింది. ఈ అంశంలో మీడియా కూడా సాహాకు మద్దతు ఇవ్వాలని ఐసీయే కార్యదర్శి హితేశ్ మజుందార్ పేర్కొన్నారు.

More Telugu News