Vijayashanti: కేసీఆర్ సర్కారుకు రైతుల ఉసురు తగలడం ఖాయం: విజయశాంతి

  • మొక్కజొన్న రైతుల పరిస్థితి వివరించిన విజయశాంతి
  • కేసీఆర్ సర్కారు పంట కొనడంలేదని ఆరోపణ
  • రైతులు వ్యాపారులకు అమ్ముకుంటున్నారని వెల్లడి
  • తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆందోళన
Vijayasanthi slams CM KCR and Telangana Govt

తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి సీఎం కేసీఆర్ పై విమర్శల జడివాన కురిపించారు. అన్నదాతలను సీఎం కేసీఆర్ తీవ్ర వేదనకు గురిచేస్తున్నాడని, టీఆర్ఎస్ హయాంలో పంట పండించుకునే స్వేచ్ఛ కూడా లేదని విజయశాంతి ధ్వజమెత్తారు. కనీస మద్దతు ధరకు దిక్కులేదని, మొక్కజొన్న రైతులు తీవ్రకష్టాల్లో చిక్కుకున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న పంట కొనడంలేదని, పంట పండించిన రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకుని నష్టాల ఊబిలోకి జారుకున్నారని వెల్లడించారు.

యాసంగిలో రాష్ట్రం మొత్తమ్మీద 4,02,405 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారని, ఇప్పుడా పంట చేతికొచ్చిందని విజయశాంతి పేర్కొన్నారు. కానీ పంట కొనుగోళ్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. మార్క్ ఫెడ్ వద్ద ఒక్క మొక్కజొన్న గింజ కూడా లేకపోయినా, నిల్వలు ఉన్నాయని, కొనుగోళ్లతో నష్టం వస్తుందన్న సాకుతో రెండేళ్లుగా కేసీఆర్ సర్కారు మొక్కజొన్న పంట జోలికి వెళ్లడంలేదని వివరించారు.

ఈసారి కూడా రైతులు వ్యాపారులకు తమ పంటను తక్కువ ధరలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. కేంద్రం క్వింటాల్ కు రూ.1,870 చొప్పున ధర ప్రకటించిందని, అయితే కేసీఆర్ సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మార్క్ ఫెడ్ ద్వారా కొంటేనే మొక్కజొన్నకు మద్దతు ధర దక్కుతుందని స్పష్టం చేశారు. అదే, వ్యాపారులకు అమ్మితే రైతులు క్వింటాల్ పై రూ.500 నుంచి రూ.800 వరకు నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. మొత్తమ్మీద రైతులకు యాసంగిలో రూ.629 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మొదట్లో మొక్కజొన్న వేయొద్దని చెప్పి, ఆ తర్వాత వరి వేయొద్దన్నారని, వేసిన పంటలు సకాలంలో కొనకుండా, తగిన మద్దతు ధర ఇవ్వకుండా రైతులను టీఆర్ఎస్ సర్కారు నానా ఇబ్బందులకు గురిచేస్తోందని విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్ సర్కారు పాలనలో ఏ పంట వేయాలనే స్వేచ్ఛ కూడా రైతులకు లేకుండా పోయిందని ఆక్రోశించారు.

ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తూ, అన్నదాతలను తీవ్ర వేదనకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. రైతు కంట కన్నీరు పెట్టించిన సర్కారు నిలబడదని విజయశాంతి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్నదాతలు కేసీఆర్ సర్కారును బొందపెట్టి, బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News