Punch Prabhakar: పంచ్ ప్రభాకర్ కొత్త పద్ధతిలో వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు: కోర్టుకు తెలిపిన న్యాయవాది

  • రాజకీయ ప్రముఖులపై పంచ్ ప్రభాకర్ వీడియోలు
  • అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపణలు
  • కేసు నమోదు
  • అరెస్ట్ కోసం తీసుకున్న చర్యలపై సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు
High Court hearing on Punch Prabhakar case

గతంలో పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వంటి ప్రముఖులపై యూట్యూబ్ లో అభ్యంతరకర వీడియోలు పోస్టు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కోవడం తెలిసిందే. దీనిపై కేసు కూడా నమోదైంది. అమెరికాలో నివసించే పంచ్ ప్రభాకర్ ఏపీలో టీడీపీ నేతలు, పలువురు జడ్జిలపైనా ఇదే రీతిలో వీడియోలు రూపొందించినట్టు కూడా వెల్లడైంది.

ఈ నేపథ్యంలో, సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసుకు సంబంధించి హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా పంచ్ ప్రభాకర్ కేసుపై న్యాయవాది అశ్వినీకుమార్ మెమో దాఖలు చేశారు. పంచ్ ప్రభాకర్ కొత్త పద్ధతిలో వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. ప్రైవేట్ యూజర్ ఐడీల ద్వారా వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారని వివరించారు.

దీనిపై కోర్టు స్పందిస్తూ, వీడియోలను వెంటనే తొలగించాలని యూట్యూబ్ ను హైకోర్టు ఆదేశించింది. పంచ్ ప్రభాకర్ అరెస్ట్ కు తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని సీబీఐని కోరింది. వీడియోలు అప్ లోడ్ చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది.

అందుకు సీబీఐ... పంచ్ ప్రభాకర్ కు అమెరికా పౌరసత్వం ఉందని కోర్టుకు తెలిపింది. పంచ్ ప్రభాకర్ ను అరెస్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలని వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతి కోసం దరఖాస్తు చేశామని వివరించింది. ఇంటర్ పోల్ ద్వారా బ్లూ నోటీస్ జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించింది. వాదనలు విన్న హైకోర్టు... 10 రోజుల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.

  • Loading...

More Telugu News