Mekapati Goutham Reddy: చెట్టంత కొడుకు మరణంతో తల్లడిల్లిపోతున్న మేకపాటి రాజమోహనరెడ్డి

  • ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత
  • గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన వైనం
  • కన్నీటిపర్యంతమైన మేకపాటి రాజమోహన్ రెడ్డి
  • తాడేపల్లిలో సంతాప సభ ఏర్పాటు చేసిన ఏపీ మంత్రులు
Mekapati Rajamohan Reddy deeply saddened to his son death

వైసీపీ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపుతూ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణించడం తెలిసిందే. ఆయన హఠాన్మరణం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి వేదన వర్ణనాతీతం. 49 ఏళ్ల వయసుకే తనయుడు ఈ లోకాన్ని విడిచివెళ్లడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని సందర్శిస్తున్న వారికి అక్కడ తీరని దుఃఖంతో విలపిస్తున్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఓదార్చడం శక్తికి మించినపనవుతోంది.

77 ఏళ్ల రాజమోహన్ రెడ్డికి రాజకీయ వారసుడిగా ఏపీ రాజకీయాల్లోకి అడుగిడిన మేకపాటి గౌతమ్‌రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, వైసీపీ అధినేత సీఎం జగన్ మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనను మంత్రి పదవి కూడా వరించింది. రాజమోహన్ రెడ్డికి ముగ్గురు కుమారులు కాగా, వారిలో అటు వ్యాపారాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నది గౌతమ్ రెడ్డి ఒక్కరే.

కొడుకు అభ్యున్నతి చూస్తూ పుత్రోత్సాహం పొందుతున్న మేకపాటి రాజమోహన్ రెడ్డికి తనయుడి అకాలమృతి గుండెకోతను మిగిల్చింది. ఈ విషాద సమయంలో తమను పరామర్శించడానికి వచ్చిన వారి వద్ద ఆయన కన్నీటి పర్యంతమైనట్టు తెలుస్తోంది.

కాగా, తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభ ఏర్పాటు చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి మేకపాటి చిత్రపటానికి నివాళులు అర్పించారు. మంత్రి మేకపాటి వ్యక్తిత్వాన్ని, పార్టీ కోసం ఆయన కృషి చేసిన తీరును జ్ఞప్తికి తెచ్చుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యం చేకూర్చాలని ప్రార్థించారు.

More Telugu News