Shivamogga: భజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్య.. శివమొగ్గ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు

  • జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
  • రంగంలోకి రిజర్వ్ పోలీసు బలగాలు
  • దర్యాప్తు పూర్తయితేనే వాస్తవాలు తెలుస్తాయి
  • శాంతియుతంగా ఉండాలి
  • హోం శాఖ మంత్రి జ్ఞానేంద్ర
Sec 144 in Shivamogga after Bajrang Dal activist murder

కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా దొడ్డపేట పోలీసు స్టేషన్ పరిధిలో భజరంగ్ దళ్ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. 23 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్త, టైలర్ హర్షపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ ప్రాణాలు విడిచాడు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటన తర్వాత కొన్ని వాహనాలకు స్థానికులు నిప్పు పెట్టారు.

పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. తాజా దాడికి హిజాబ్ వివాదం కారణం కాదని కర్ణాటక హోం శాఖ మంత్రి అరగా జ్ఞానేంద్ర ప్రకటించారు. ఈ అంశంలో ఒక ముగింపునకు రావడానికి ముందు దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాలని కోరారు. నేరస్థులను త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు.

హత్య వెనుక వాస్తవాలు వెలుగు చూడాల్సి ఉందని, కనుక ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. రిజర్వ్ పోలీసు బలగాలను రంగంలోకి దించినట్టు చెప్పారు. పోలీసుల చర్యల పట్ల తాము సంతోషంగా లేమని భజరంగ్ దళ్ కర్ణాటక కన్వీనర్ రఘు సకలేష్ పూర్ తెలిపారు. అతడు తమ చురుకైన కార్యకర్త అని, తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు ఒక మతానికి చెందిన గూండాలు ఈ హత్యలో పాలుపంచుకున్నట్టు, వారిని కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ప్రేరేపించినట్టు కర్ణాటక రాష్ట్ర మంత్రి ఈశ్వరప్ప సంచలన ఆరోపణలు చేశారు.

More Telugu News