FPIs: పెట్టుబడులను పెద్ద ఎత్తున వెనక్కి తీసుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు

  • ఫిబ్రవరిలో  రూ.18,856 కోట్ల అమ్మకాలు
  • గడిచిన ఐదు నెలలుగా ఇదే ధోరణి
  • గత ఏడాదిలో రూ.60వేల కోట్ల విక్రయాలు
  • పరిస్థితి మారడానికి సమయం పట్టొచ్చన్న అంచనాలు
FPIs pull out Rs 18856 crore from Indian markets in Feb so far

అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న ఆందోళనలు, రష్యా యుద్ధానికి దిగుతుందన్న ఆందోళనలు ఈక్విటీల విషయంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ పీఐలు, ఎఫ్ఐఐలు) పెద్ద ఎత్తున భారత ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలు సాగిస్తున్నారు.
 
విదేశీ ఇన్వెస్టర్లు ఫిబ్రవరి నెలలో 18వ తేదీ వరకు భారీగా రూ.18,856 కోట్ల మేర అమ్మకాలు చేశారు. ఇందులో రూ.15,342 కోట్లు ఈక్విటీల నుంచి, రూ.3,629 కోట్లు బాండ్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో నికరంగా అమ్మకాలు చేసుకుంటూ వస్తున్నారు. దేశీయ ఇనిస్టిట్యూషనల్, హెచ్ఎన్ఐ, రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లే మార్కెట్ ను పెద్ద ఎత్తున ఆదుకుంటున్నాయి.
 
విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల నుంచి గడిచిన ఏడాది కాలంలో 8 బిలియన్ డాలర్లు (రూ.60వేల కోట్లు) వెనక్కి తీసేసుకున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్లు ఆకర్షణీయ స్థాయిలకు దిగొచ్చే వరకు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా సంక్షోభం సమసిపోయినా, యూఎస్ ఫెడ్ రేట్లు పెంపు విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు.

More Telugu News