hijab: అందుకే దేశంలో హిజాబ్ వివాదం చెల‌రేగుతోంది: క‌ర్ణాట‌క మంత్రి అశోక్‌

  • దీని వెనుక ఐఎస్ఐఎస్ కుట్ర‌
  • విదేశీ సంస్థ‌లూ ఉన్నాయి
  • చిన్నారులు వివాదాల్లో భాగం కాకూడ‌దు
  • పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌ర‌గాలి
karnataka minister on hihab

క‌ర్ణాట‌క‌లో చెల‌రేగిన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. విద్యా సంస్థ‌ల్లో యూనిఫాం ఉండ‌గా, హిజాబ్ ధ‌రించ‌డం ఏంట‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, హిజాబ్ ధ‌రించ‌డం ముస్లిం బాలికల హ‌క్కు అంటూ మ‌రికొంద‌రు వాదిస్తున్నారు. దీనిపై స్పందించిన కర్ణాటక మంత్రి ఆర్ అశోక్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

భార‌త్‌లో చెల‌రేగుతోన్న ఈ వివాదం వెనుక ఐఎస్ఐఎస్‌తో పాటు ప‌లు అంతర్జాతీయ సంస్థల కుట్ర‌ ఉందని ఆరోపించారు. ముస్లిం బాలికలు, మహిళలను నిందించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఈ వివాదం వెనక చాలా మంది ఉన్నారని, ఉడుపిలో ప్రారంభమైన నిరసనలు అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్తాయని ఆయ‌న అన్నారు.

వేగంగా ఈ నిరసనలు వ్యాపించేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారంటూ ఆయ‌న నిల‌దీశారు. కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ సంస్థ కూడా ఈ వివాదం వెనుక ఉంద‌ని చెప్పారు. చిన్నారులు ఇలాంటి మతపరమైన వివాదాల్లో భాగం కాకూడ‌ద‌ని ఆయ‌న అన్నారు. పిల్ల‌లు ఇళ్లలో ఏమైనా చేసుకోవచ్చని, అయితే, విద్యా సంస్థ‌ల్లో మాత్రం విద్య‌పైనే దృష్టి పెట్టాలని ఆయ‌న హిత‌వు ప‌లికారు. హిజాబ్‌పై చెల‌రేగుతోన్న‌ వివాదంలో విద్యార్థులు ఉన్నారు కాబట్టి తాము ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదని ఆయ‌న అన్నారు.

ఈ అంశంపై తాము దశల వారీగా తగిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఈ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉందని ఆయ‌న అన్నారు. ముఖ్య‌మంత్రితో ఈ అంశంపై తాను మాట్లాడతాన‌ని అన్నారు. కాగా, విద్యా సంస్థల్లో ఇప్ప‌టికీ కొంద‌రు విద్యార్థులు హిజాబ్ ధరిస్తున్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.

దీంతో ప‌లు విద్యా సంస్థ‌ల వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొంటున్నాయి. హిజాబ్ ధ‌రించి వ‌చ్చే బాలిక‌ల‌ను గేటు వ‌ద్దే విద్యా సంస్థ‌ల సిబ్బంది అడ్డుకుంటోన్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని క‌ళాశాల‌ల ముందు విద్యార్థులు ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు.

More Telugu News