Telangana Congress: టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. పీకే మాజీ సహచరుడితో చర్చలు!

Telangana Congress To Hire Pks Ex aide For Poll Plot
  • కనీసం 90 సీట్లపై కన్ను
  • సునీల్ కనుగోలుతో చర్చలు
  • త్వరలో ఒప్పందానికి అవకాశం
  • కర్ణాటకలోనూ వినియోగించుకునే ఆలోచన

తెలంగాణలో టీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలో తలమునకలైంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత వరుసగా రెండు సార్లు ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ అధికారాన్ని అనుభవిస్తుండడం తెలిసిందే. మూడో పర్యాయం కూడా గెలుపు బాట పట్టేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) సేవలను తీసుకోవాలన్న ప్రణాళికతో ఉంది. ఇప్పటికే పీకేతో ఈ విషయమై టీఆర్ఎస్ అగ్రనేతలు చర్చలు కూడా నిర్వహించారన్న సమాచారం వెలుగులోకి వచ్చింది.

మరోవైపు తెలంగాణలో బీజేపీ సైతం దూకుడుగా వెళుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు కురిపిస్తూ, ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. తద్వారా తెలంగాణలో బీజేపీ జెండాను మరింత బలంగా నాటాలన్న వ్యూహంతో అడుగులు వేస్తోంది. దీంతో ఇరు పార్టీలను ఎదుర్కొని అధికారం సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది.

ఇందులో భాగంగా ప్రశాంత్ కిషోర్ మాజీ సహచరుడు సునీల్ కనుగోలు సేవలను ఉపయోగించుకునే ప్రతిపాదనపై పనిచేస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రతినిధులు ఇప్పటికే సునీల్ కనుగోలుకు చెందిన ‘మైండ్ షేర్ అనలైటిక్స్’తో ఢిల్లీలో ఒక దఫా చర్చలు నిర్వహించినట్టు తెలిపాయి. త్వరలోనే ఒప్పందం కుదరొచ్చని వెల్లడించాయి.

వచ్చే ఎన్నికల్లో అధికారానికి అవకాశం ఉన్న తెలంగాణతోపాటు, కర్ణాటకలోనూ మైండ్ షేర్ అనలైటిక్స్ సేవలను వినియోగించుకునేందుకు పలువురు ఏఐసీసీ నాయకులు సుముఖంగా ఉన్నట్టు తెలిపాయి. తెలంగాణలో కనీసం 90 సీట్లలో అయినా గెలవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు పేర్కొన్నాయి.

సునీల్ కనుగోలు 2014లో సార్వత్రిక ఎన్నికల్లో పీకే బృందం సభ్యుడిగా నరేంద్ర మోదీ గెలుపు కోసం పనిచేశారు. ఆ తర్వాత పీకే టీమ్ నుంచి వేరు పడి బీజేపీకి సేవలు అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News