KCR: నేడు ముంబైకి కేసీఆర్.. ఉద్ధవ్‌తో బీజేపీ వ్యతిరేక కూటమిపై చర్చ

  • ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబై
  • ఉద్ధవ్‌తో మధ్యాహ్నం ఒంటి గంటకు భేటీ
  • ఆ తర్వాత శరద్ పవార్‌తోనూ సమావేశం
KCR to visit mumbai today and meet with Uddhav Thackeray

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ముంబై వెళ్లనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబై వెళ్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో ఆయన నివాసంలో సమావేశమై బీజేపీ వ్యతిరేక కూటమిపై చర్చిస్తారు. అలాగే, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తోనూ కేసీఆర్ భేటీ అవుతారు. కేసీఆర్ వెంట మంత్రి హరీశ్‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తదితరులు వెళ్తారు.

ఇటీవల బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఆ పార్టీ విధానాలను కేసీఆర్ ఎండగడుతున్నారు. ప్రధాని మోదీ ఇటీవల తెలంగాణలో పర్యటించినప్పటికీ కేసీఆర్ దూరంగా ఉన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ బహిష్కరించింది. కేంద్రంలో బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఉద్ధవ్ థాకరే మద్దతు లభించింది. మాట్లాడుకుందాం రండంటూ పిలుపొచ్చింది. ఇందులో భాగంగానే కేసీఆర్ నేడు ముంబై వెళ్తున్నారు.

ఉద్ధవ్ థాకరేతో సమావేశం సందర్భంగా బీజేపీ వ్యతిరేక కూటమిపై చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే, గోదావరి నదిపై వార్ధా బ్యారేజీ నిర్మాణంపైనా చర్చిస్తారని సమాచారం. ఉద్ధవ్‌తో భేటీ ముగిసిన అనంతరం శరద్ పవార్‌తో కేసీఆర్ భేటీ అవుతారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయాలన్న తమ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల్సిందిగా కేసీఆర్ ఆయనను కోరనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ముంబైలో టీఆర్ఎస్ అభిమానులు కేసీఆర్ ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. కాగా, థాకరేతో సమావేశం అనంతరం కేసీఆర్ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాలలోనూ పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి విపక్ష నేతలతో సమావేశమవుతారని సమాచారం.

  • Loading...

More Telugu News