Himalaya Yogi: ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను కీలుబొమ్మను చేసి ఆడించిన 'హిమాలయ యోగి'!

  • ఎన్ఎస్ఈలో అవకతవకలు
  • సెబీ విచారణలో తెరపైకి హిమాలయ యోగి అంశం
  • ఆ యోగికి ఆకారం లేదంటున్న చిత్రా రామకృష్ణ
Who is Himalaya Yogi that influenced Chitra Ramakrishna

నేషనల్ స్టాక్ ఎక్చేంజి (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ వ్యవహారం సెబీ అధికారులకు కూడా అంతుబట్టడంలేదు. ఆమెను కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రేరేపించిన అదృశ్య శక్తి 'హిమాలయ యోగి' ఎవరో అధికారులు తెలుసుకోలేకపోయారు.

అయితే, సెబీ అధికారుల దర్యాప్తులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సెబీ దర్యాప్తులో వెల్లడైన విషయాల ప్రకారం.... 2015 డిసెంబరు 4న చిత్రా రామకృష్ణకు హిమాలయ యోగి నుంచి ఓ మెయిల్ వచ్చింది.

"ఎన్ఎస్ఈ సెల్ఫ్ లిస్టింగ్ కోసం అవసరమైతే ప్రధానమంత్రి ఇంటికి కూడా వెళ్లాలి. ఆర్థికమంత్రి, క్యాబినెట్ కార్యదర్శి, ఆర్థిక సలహాదారు, పీఎంఓ అధికారి... ఇలా కీలక వ్యక్తులను కలవాల్సి ఉంటుంది. ఇదేమంత పెద్ద విషయం కాదు. కంచన్ (ఆనంద్ సుబ్రమణియన్)కు నేను అంతా చెప్పాను. అతడే చూసుకుంటాడు. నువ్వు ఆందోళన చెందకు... నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే... ఎన్ఎస్ఈ సెల్ఫ్ లిస్టింగ్ కు ఆర్థికమంత్రిత్వ శాఖ గట్టి పట్టుదలతో ఉందని సెబీని నమ్మించు. ఆ తర్వాత జరిగేదంతా చూస్తూ హాయిగా ఎంజాయ్ చేయ్" అని ఆ ఈమెయిల్ లో ఉంది.

కాగా, సదరు హిమాలయ యోగి చెప్పినందునే ఆనంద్ సుబ్రమణియన్ కు ఎన్ఎస్ఈలో చిత్రా రామకృష్ణ కీలక పదవులు కల్పించినట్టు సెబీ గుర్తించింది. అతడికి స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో పెద్దగా అనుభవంలేకపోయినా గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, అడ్వైజర్ గా నియమించారు.

చిత్రా రామకృష్ణ కొన్ని కారణాల వల్ల 2016లో ఎన్ఎస్ఈ సీఈవోగా తప్పుకున్నారు. ఆమె హయాంలో జరిగిన అవకతవకలపై సెబీ విచారణ జరిపి 190 పేజీలతో భారీ నివేదిక రూపొందించింది. ఈ విచారణలో హిమాలయ యోగి అంశం వెల్లడైంది. అయితే, ఆ యోగికి ఓ ఆకారం అంటూ ఉండదని చిత్రా పేర్కొన్నారు.

కొన్నేళ్లుగా ఎన్ఎస్ఈ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించిన సెబీ, సీబీఐ ఆ హిమాలయ యోగి ఆనంద్ సుబ్రమణియనే అయ్యుంటాడని అనుమానిస్తున్నాయి. చిత్రాను పావుగా చేసుకుని అక్రమాలకు తెరదీసేందుకే తెరవెనుక నుంచి హిమాలయ యోగిగా కథ నడిపించి ఉంటాడని అంచనా వేస్తున్నాయి. అయితే, దీనిపై మరింత దర్యాప్తు అవసరమని అధికారులు భావిస్తున్నారు.

More Telugu News