Andhra Pradesh: సీఎం జగన్ కు కృతజ్ఞతలు.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: ఏపీ కొత్త డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

  • నాపై నమ్మకం ఉంచి డీజీపీగా సీఎం అవకాశాన్ని కల్పించారు
  • పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఎన్నో ఆకాంక్షలు ఉంటాయి
  • గౌతమ్ సవాంగ్ ఎంతో బాగా విధులను నిర్వర్తించారు
Thanks to AP CM for giving me opportunity as DGP says Rajendranath Reddy

ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి డీజీపీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తానని అన్నారు.

పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఎన్నో ఆకాంక్షలు ఉంటాయని చెప్పారు. ఒక కానిస్టేబుల్ తప్పు చేసినా మొత్తం పోలీసు వ్యవస్థపైనే ఆరోపణలు వస్తాయని అన్నారు. మతాల మధ్య సామరస్యం కాపాడటం ముఖ్యమని చెప్పారు. చిన్న పొరపాటు కూడా జరక్కుండా గౌతమ్ సవాంగ్ ఎంతో బాగా విధులను నిర్వర్తించారని అన్నారు. పోలీసు వ్యవస్థకు టెక్నాలజీని అందించారని కొనియాడారు. సవాంగ్ సామర్థ్యం చూసే ఆయనకు ముఖ్యమంత్రి మరో కీలక బాధ్యతను అప్పగించారని చెప్పారు.  

1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్నారు. ఆయన 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ అదనపు ఎస్పీగా విధుల్లో చేరారు. జిల్లాలో పలు బాధ్యతలను నిర్వహించిన తర్వాత విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పని చేశారు. విశాఖ, విజయవాడ పోలీస్ కమిషనర్ గా పని చేశారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పని చేశారు.

  • Loading...

More Telugu News