Trujet: ‘ట్రూజెట్’ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదన్న వార్తలపై స్పందించిన సినీ నటుడు రామ్ చరణ్

Tollywood actor ram charan responds over trujet employees salaries
  • విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన ట్రూజెట్
  • ఉద్యోగులకు వేతనాలు ఆపడం లేదన్న రామ్ చరణ్
  • సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమన్న సంస్థ ఎండీ ఉమేశ్

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న చౌక ధరల ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ ఇటీవల తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విమాన సర్వీసులను దగ్గర చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఉడాన్’ పథకం కింద అత్యధికంగా విమాన సేవలు అందిస్తున్న సంస్థల్లో ట్రూజెట్ ఒకటి.

అర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ సంస్థను కరోనా మహమ్మారి మరింత దెబ్బతీసింది. దీంతో మరింత చితికి పోయింది. పరిపాలనాపరమైన, సాంకేతిక కారణాల వల్ల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, త్వరలోనే మళ్లీ సేవలు ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ వి.ఉమేశ్ తెలిపారు. ఒక ఇన్వెస్టర్ నుంచి 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 165 కోట్లు) సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇవి ఫైనల్ అవుతాయని ఉమేశ్ తెలిపారు.

ఈ సంస్థ ఎండీ ఉమేశ్ టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్‌కు సన్నిహితుడు. ఇద్దరూ కలిసి టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ సంస్థను ప్రారంభించారు. ఇందులో భాగంగా 12 జులై 2015న విమాన సేవలు ప్రారంభించారు. ఆర్థిక నష్టాల్లో ఉన్న ఈ సంస్థ సేవలు తాత్కాలికంగా నిలిచిపోవడంపై సోషల్ మీడియాలో పలు వార్తలు హల్‌చల్ చేశాయి. ట్రూజెట్ సంస్థ నష్టాల్లో ఉందని, అందుకే మూసేస్తున్నారని, ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వడం లేదన్న వార్తలు వచ్చాయి.

సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్న ఈ వార్తలపై రామ్ చరణ్ స్పందించారు. ఆ వార్తలు పూర్తి అవాస్తవమని, ఉద్యోగులకు వేతనాలను ఆపలేదని, అందరికీ చెల్లిస్తున్నట్టు చెప్పారు. సంస్థ ఎండీ ఉమేశ్ కూడా ఈ వార్తలపై వివరణ ఇచ్చారు. ట్రూజెట్ విమాన సేవలు ఆపేస్తున్నట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధమని, ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరారు. తమ సంస్థపై బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

సంస్థలోని పెద్ద స్థానాల్లో ఉన్న అధికారులు రాజీనామా చేశారని, వారి స్థానాలను కొత్త వారితో భర్తీ చేసినట్టు చెప్పారు. త్వరలోనే ఓ ఇన్వెస్టర్ రానున్నారని, ఆ తర్వాత కొత్త సీఈవోను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ట్రూజెట్ సేవలు మళ్లీ ప్రారంభమవుతాయని పేర్కొన్న ఉమేశ్.. నవంబరు 2021 నుంచి ఇప్పటి వరకు ఉద్యోగులకు పైసా కూడా చెల్లించలేదన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, వారికి పాక్షికంగా వేతనాలు చెల్లిస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News