Kavya Thapar: ముంబయిలో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్... తప్పతాగి పోలీసులపై చిందులు

  • తెలుగులో పలు చిత్రాల్లో నటించిన కావ్యా థాపర్
  • ఫ్రెండ్ తో పార్టీ చేసుకుని తిరిగి వస్తూ మరో వాహనాన్ని ఢీ
  • కారు డ్రైవర్ పై ఆగ్రహం
  • న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన పోలీసులు
  • జ్యుడీషియల్ కస్టడీ విధింపు
Mumbai police arrests Tollywood heroine Kavya Thapar

ఈ మాయ పేరేమిటో చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కావ్యా థాపర్. ఇటీవల ఏక్ మినీ కథ చిత్రంలో నటించి సక్సెస్ అందుకుంది. అయితే, ముంబయిలో మద్యం సేవించి కారు నడిపి, ఓ వ్యక్తిని గాయపర్చిన కేసులో పోలీసులు కావ్యా థాపర్ ను అరెస్ట్ చేశారు. అంతేకాదు, డ్యూటీలో ఉన్న పోలీసులపైనా ఆమె నోరు పారేసుకుంది.

ఈ ఘటన గురువారం వేకువజామున జరిగింది. ముంబయిలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ వద్ద ఆమె తన వాహనంతో మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. దాంతో కావ్యా థాపర్ సదరు కారు డ్రైవర్ ను దూషించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, వారిపై కూడా అసభ్య పదజాల ప్రయోగం చేసింది.

ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మెట్రోపాలిటన్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా, జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కావ్యా థాపర్ ఓ ఫ్రెండ్ తో పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మోడలింగ్ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించిన కావ్యా థాపర్ ముంబయిలో నివసిస్తోంది.

More Telugu News