The Felicity Ace: నౌక నిండా విలాసవంతమైన కార్లు... అగ్నిప్రమాదం జరగడంతో నౌకను నడిసముద్రంలో వదిలేసిన సిబ్బంది

  • వేల సంఖ్యలో కార్లతో బయలుదేరిన ఓడ
  • అట్లాంటిక్ సముద్రంలో అజోరెస్ ఐలాండ్స్ వద్ద ఘటన
  • నౌకలో మంటలు
  • 22 మంది సిబ్బందిని తరలించిన పోర్చుగీస్ దళాలు
  • ఓడలో లాంబోర్ఘిని, పోర్షే, ఆడి, ఫోక్స్ వాగన్ కార్లు
Cargo ship with thousands of luxury cars caught fire and adrift in Atlantic ocean

పనామాకు చెందిన ది ఫెలిసిటీ ఏస్ అనే భారీ రవాణా నౌక అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లతో ప్రయాణిస్తూ సముద్రంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఓడలో లాంబోర్ఘిని, పోర్షే, ఆడి, ఫోక్స్ వాగన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల కార్లు ఉన్నాయి.

ఈ ఓడ అట్లాంటిక్ మహాసముద్రంలో అజోరెస్ దీవుల వద్దకు వచ్చేసరికి అగ్నిప్రమాదానికి గురైంది. సమీపంలోనే ఉన్న పోర్చుగీస్ నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఈ నౌకకు సంబంధించిన సమాచారాన్ని అందుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ది ఫెలిసిటీ ఏస్ ఓడలోని 22 మంది సిబ్బందిని సురక్షితంగా తరలించారు. అజోరెస్ దీవుల్లోని ఓ హోటల్ లో వారికి ఆశ్రయం ఏర్పాటు చేశారు.

అయితే, కోట్లాది రూపాయల ఖరీదైన కార్లతో కూడిన ఆ ఓడ ఇప్పుడు నడిసముద్రంలో కొట్టుకుపోతోంది. ఆ నౌకలో ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. కాగా, ఈ ఓడలో ఒక్క ఫోక్స్ వాగన్ కంపెనీకి చెందినవే 3,965 కార్లు ఉన్నాయట. దాంతో జర్మనీలోని ఆ సంస్థ యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ కార్గో ఓడ ప్రపంచవ్యాప్తంగా పలు రేవు పట్టణాలకు కార్లను చేర్చాల్సి ఉంది.

లగ్జరీ కార్ల తయారీకి పెట్టిందిపేరైన పోర్షే సంస్థ కూడా ఈ పరిణామం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పోర్షే కంపెనీ కార్లు ఈ ఓడలో 1,100 ఉండడమే అందుకు కారణం.

2019లో గ్రాండే అమెరికా అనే నౌక కూడా ఇలాగే 2 వేల లగ్జరీ కార్లతో వెళుతూ సముద్రంలో మునిగిపోయింది. కాగా, ది ఫెలిసిటీ ఏస్ నౌక యజమాని ఈ ప్రమాదంపై వెంటనే అప్రమత్తమయ్యారు. మరో నౌక సాయంతో తమ నౌకను సురక్షితంగా తీరానికి చేర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

  • Loading...

More Telugu News