Anam Ramanarayana Reddy: నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం.. ఆనంపై నేదురుమల్లి ఫైర్!

  • వెంకటగిరిని బాలాజీ జిల్లాలో కలపొద్దన్న ఆనం
  • హడావుడి నిర్ణయాలతో విద్వేషాలు పెరుగుతాయని వ్యాఖ్య
  • తన తండ్రి లేకపోతే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండేది కాదన్న రాంకుమార్ రెడ్డి
Anam Ramanarayana Reddy Vs Nedurumalli Ram Kumar Reddy

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, మరో నేత రాంకుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం జరుగుతోంది. బాలాజీ జిల్లాలో వెంకటగిరిని కలపడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయని ఆనం అన్నారు. విభజన విషయంలో హడావుడి నిర్ణయాలు తీసుకుంటే విద్వేషాలు పెరుగుతాయని పేర్కొన్నారు. సున్నితమైన సమస్యలను జటిలం చేయకూడదని చెప్పారు. వద్దూవద్దు అంటున్న కందుకూరును నెల్లూరులో కలిపారని అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు.

ఆనం వ్యాఖ్యలపై నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మండిపడ్డారు. బాలాజీ జిల్లాకు వెంకటగిరి ప్రజలు వ్యతిరేకంగా లేరని చెప్పారు. మీరు మాత్రం ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో అర్థం కావడం లేదని అన్నారు. తన తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి లేకుంటే మీకు రాజకీయ భవిష్యత్తు లేదని... ఆనం కుటుంబాన్ని తొక్కాలనుకుని ఉంటే తన తండ్రి జనార్దన్ రెడ్డి హయాంలోనే పక్కన పెట్టేవారని వ్యాఖ్యానించారు. నీతి మాలిన రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు.

More Telugu News