Maharashtra: ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించిన రైతు.. 14 రూపాయలతో 100 కిలోమీటర్ల ప్రయాణం

maharashtra nanded farmer dnyaneshwar kalyankar electric bikes
  • మహారాష్ట్రకు చెందిన పూల రైతు ధ్యానేశ్వర్ ఘనత
  • పదో తరగతి వరకు మాత్రమే చదువు
  • రెండేళ్లు కష్టపడి పెట్రోలు బైకును ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చిన వైనం
  • మొత్తం ఖర్చు రూ. 40 వేలు  

అవసరం అనేది ఆవిష్కరణలకు తల్లిలాంటిదని చెబుతారు. దీనిని నిరూపించే ఘటనలు కూడా అనేకం. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ రైతు అవసరం.. అతడిని ఆవిష్కరణల దిశగా పురికొల్పింది. తాను పండించే పూలను మార్కెట్‌కు తరలించేందుకు ప్రతి రోజూ రూ. 250 ఖర్చవుతుండగా దానిని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన పెట్రోలు బైకును ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పని ప్రారంభించాడు. రెండేళ్లపాటు కష్టనష్టాలు భరించి ఎట్టకేలకు విజయం సాధించాడు. ఇప్పుడతడు రూపొందించిన ఎలక్ట్రిక్ బైక్‌పై 14 రూపాయల ఖర్చుతో ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా అర్ధాపూర్ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ పూల రైతు. పదో తరగతి వరకు చదువుకున్నాడు. తనకున్న కొద్దిపాటి పొలంలో పూలను పండించేవాడు. పండించిన పూలను మార్కెట్‌కు తరలించేందుకు చేతి చమురు వదిలించుకోవాల్సి వచ్చేది. లాభం మాట అటుంచి ప్రయాణ ఖర్చులకే వచ్చేది సరిపోయేది. ఇలాగైతే లాభం లేదని, ఖర్చు తగ్గించుకోవాలని భావించాడు. ఇందుకోసం పరిపరి విధాల ఆలోచించాడు.

చివరికి తన పెట్రోలు బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా పని ప్రారంభించాడు. లాక్‌డౌన్ సమయంలో రెండేళ్లపాటు కష్టపడి అనుకున్నది సాధించాడు. బైక్‌కు 750 వోల్ట్ సామర్థ్యమున్న మోటారు, 48 వోల్టుల బ్యాటరీ, చార్జర్, కంట్రోలర్, లైటు, ఎలక్ట్రిక్ బ్రేకు విజయవంతంగా అమర్చాడు. బ్యాటరీని నాలుగు గంటలపాటు చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు ప్రయాణించేలా తీర్చిదిద్దాడు.

పెట్రోలు బైకును పూర్తి విద్యుత్ బైక్‌గా మార్చేందుకు రూ. 40 వేలు ఖర్చు చేశాడు. పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న ధ్యానేశ్వర్ చేసిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సహకారం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ధ్యానేశ్వర్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News