CM KCR: ఆదివారం ముంబయి వెళ్లనున్న సీఎం కేసీఆర్... ఉద్ధవ్ థాకరేతో లంచ్!

  • కేంద్రంపై కేసీఆర్ యుద్ధభేరి
  • నేరుగా మోదీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు
  • కలిసి వచ్చే నేతలతో మంతనాలు
  • భవిష్యత్ కార్యాచరణపై థాకరేతో చర్చించే అవకాశం
CM KCR will go to Mumbai to meet Udhav Thackeray

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా సమరశంఖం పూరించిన తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయస్థాయి నాయకులతో మంతనాలకు తెరదీశారు. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో, ఆదివారం ముంబయి వెళ్లనున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ఈ సందర్భంగా జాతీయస్థాయి రాజకీయాలు, కొత్త ఫ్రంట్ అంశాలు చర్చిస్తారని తెలుస్తోంది.

గత కొన్నిరోజుల వ్యవధిలో కేసీఆర్... పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడలతో ఫోన్ లో మాట్లాడారు. ఉద్ధవ్ థాకరేతోనూ మాట్లాడాలని ఆయన చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. వీరి భేటీ ఇన్నాళ్లకు కుదిరింది. ఫిబ్రవరి 20న ఇరువురు నేతలు భేటీ కానున్నారు.

కాగా, తెలంగాణ సీఎంవో వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు... ఉద్ధవ్ థాకరే బుధవారం నాడు సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. బీజేపీపై పోరులో ఆయనకు తన పూర్తి మద్దతు ప్రకటించారు.

"కేసీఆర్ జీ... మీ పోరాటం స్ఫూర్తిదాయకం... విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి ఇదే తగిన సమయం. రాష్ట్రాల హక్కుల సాధన కోసం మీ పోరు కొనసాగించండి" అని థాకరే సూచించారు. ఈ సందర్భంగానే భవిష్యత్ కార్యాచరణ చర్చించేందుకు ముంబయి రావాలంటూ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News