Nitin Gadkari: సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోంది: బెజవాడలో నితిన్ గడ్కరీ

  • విజయవాడలో పలు రహదారుల పనులకు శంకుస్థాపన
  • హాజరైన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
  • తమకు అన్ని రాష్ట్రాలు సమానమేనని వెల్లడి
  • దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకమని వ్యాఖ్యలు
Union minister Nitin Gadkari appreciates CM Jagan leadership

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నేడు విజయవాడ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. పలు రహదారుల పనుల ప్రారంభోత్సవంలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజని అన్నారు. 30 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని తెలిపారు.

ఏపీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్రం పురోగామి పథంలో పయనిస్తోందని కొనియాడారు. ఏపీకి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎంతో కీలకమైనవని, వ్యవసాయ రంగంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. భారతదేశ అభివృద్ధిలో ఏపీ భాగస్వామ్యం కీలకమని భావిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడి అభివృద్ధిలో పోర్టులది కీలక పాత్ర అని స్పష్టం చేశారు.

అభివృద్ధి విషయంలో కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపదని, కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లను కేటాయిస్తామని చెప్పారు. ఏపీలో 3 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలను నిర్మిస్తున్నామని, 2024 లోపు విశాఖ-రాయ్ పూర్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేని అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. విజయవాడ-నాగపూర్, బెంగళూరు-చెన్నైలను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మిస్తామని వివరించారు. రూ.5 వేల కోట్లతో చిత్తూరు-తంజావూరు ఎక్స్ ప్రెస్ హైవేని పూర్తిచేస్తామని తెలిపారు.

కాగా, విజయవాడకు తూర్పు బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని సభాముఖంగా సీఎం జగన్ చేసిన విజ్ఞప్తికి ఇప్పటికిప్పుడే స్పందిస్తున్నామని, ఈస్ట్రన్ రింగురోడ్డుకు తక్షణమే ఆమోదం తెలుపుతున్నామని నితిన్ గడ్కరీ ప్రకటన చేశారు. 'సీఎం జగన్ 20 ఆర్ఓబీలు అడిగారు... మేం 30 ఆర్ఓబీలు మంజూరు చేస్తున్నాం' అని వెల్లడించారు.

  • Loading...

More Telugu News