Flight: విమానంలో ప్రయాణికుడి వీరంగం.. విమానం డోర్ తెరిచేందుకు ప్రయత్నించడంతో తల పగులగొట్టిన ఫ్లైట్ అటెండెంట్

Flight Attendant Hit Unruly Passenger Head twice with Tea Pot
  • వాషింగ్టన్ కు వెళ్తున్న ఫ్లైట్ లో ఘటన
  • కాక్ పిట్ లోకీ వెళ్లేందుకు ప్రయత్నం
  • కాన్సాస్ కు దారి మళ్లించి పోలీసులకు అప్పగించిన సిబ్బంది
  విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన రభస అంతా ఇంతా కాదు. మిగతా ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసేలా వ్యవహరించాడు. పైలట్లుండే కాక్ పిట్ లోకి వెళ్లేందుకు గొడవ గొడవ చేశాడు. విమానం ప్రధాన డోరు తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో ఫ్లైట్ అటెండెంట్ కు చిర్రెత్తుకొచ్చి టీ పాట్ తో అతడి తల పగులగొట్టింది. దీంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. రక్తం ధారగా కారింది. ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నుంచి వాషింగ్టన్ కు బయల్దేరిన విమానంలో ఆదివారం జరిగింది.

హంగామా సృష్టించిన వ్యక్తికి గాయం కావడంతో విమానంలోనే కట్టుకట్టి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం వాషింగ్టన్ వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించి కాన్సాస్ లో దించారు. అక్కడ పోలీస్ అధికారులకు సమాచారమివ్వడంతో వాళ్లు హంగామా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని జువాన్ రెంబర్టో రివాస్ (50)గా గుర్తించారు.

ఘటనకు సంబంధించిన వీడియోను మ్యూజ్ ముస్తఫా అనే ఓ ప్రయాణికుడు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఘటనపై అమెరికా న్యాయ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఫ్లైట్ అటెండెంట్ల దగ్గర నుంచి వైన్ బాటిల్ తీసుకున్న రివాస్.. దానిని పగులగొట్టి బెదిరించేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. సర్వీస్ కార్ట్ ను తన్నుతూ హంగామా సృష్టించాడని తెలిపింది. విమానం ఎగ్జిట్ డోర్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడని, ఓపిక నశించిన ఫ్లైట్ అటెండెంట్ టీ పాట్ తో రెండు సార్లు అతడి తలపై కొట్టిందని చెప్పింది. అతడిని ఆపేందుకు ప్రయాణికులూ ప్రయత్నించినా కంట్రోల్ కాలేదని పేర్కొంది.
Flight
Crime News
Washington
USA

More Telugu News