Revanth Reddy: వరుసగా రెండో రోజూ రేవంత్​ అరెస్ట్​.. ఇంటి వద్ద ఉద్రిక్తత

  • ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
  • కేసీఆర్ తన నీడనూ నమ్మట్లేదంటూ టీపీసీసీ చీఫ్ ఫైర్
  • సీఎం పుట్టిన రోజు జరుపుకోవడానికి రెండో రోజూ అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం
  • నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే వేడుకలు అవసరమా? అని నిలదీత
Police House Arrest Revanth For Second Day

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ కేసీఆర్ జన్మదినం సందర్భంగా గాడిదల దగ్గర కేక్ కట్ చేస్తామంటూ రేవంత్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఇవాళ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసులు నమోదు చేయాలన్న డిమాండ్ తో డీజీపీ ఆఫీసు ముట్టడికి తలపెట్టిన నేపథ్యంలో నిన్న కూడా ఆయన్ను పోలీసులు గృహ నిర్బంధంలోనే ఉంచారు.

ఇవాళ కూడా ఆయన్ను అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు.. రేవంత్ ఇంటి వద్ద పోలీసుల తీరుకు నిరసన చేపట్టాయి. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. రేవంత్ ఇంటి వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.

కాగా, పోలీసులు, ప్రభుత్వం తీరుపై రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ అసలు తన నీడను కూడా నమ్మడం లేదంటూ ఫైర్ అయ్యారు. సీఎం పుట్టిన రోజు వేడుక చేసుకోవడానికి తమను రెండో రోజూ అరెస్ట్ చేశారంటూ ఆయన ట్వీట్ చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు  చేసుకుంటున్న ఇలాంటి టైంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం అవసరమంటారా? అంటూ కేసీఆర్ ను నిలదీశారు. #TelanganaUnemployementDay #ByeByeKCR అనే హాష్ ట్యాగ్ లను ట్వీట్ కు ఆయన జోడించారు.

More Telugu News