Trujet: ఆగిపోయిన ట్రూజెట్ విమాన సర్వీసులు.. మళ్లీ వస్తామన్న సంస్థ ఎండీ

Regional airline TruJet says talks on with investor after grounding flights
  • ‘ఉడాన్’ పథకం కింద అత్యధిక సేవలు అందిస్తున్న ట్రూజెట్
  • తీవ్రంగా దెబ్బతీసిన కరోనా
  • పరిపాలన, సాంకేతిక పరమైన కారణాలతో సేవల నిలిపివేత
  • కొత్త యాజమాన్యంతో మళ్లీ వస్తామన్న సంస్థ ఎండీ
  • తుది దశలో రూ. 165 కోట్ల సమీకరణ యత్నాలు 

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న చౌక ధరల ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ తమ సేవలను నిలిపివేసింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విమాన సర్వీసులను దగ్గర చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఉడాన్’ పథకం కింద అత్యధికంగా విమాన సేవలు అందిస్తున్న సంస్థల్లో ట్రూజెట్ ఒకటి. అసలే అర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ సంస్థను కరోనా మహమ్మారి మరింత దెబ్బతీసింది. దీంతో మరింత చితికి పోయింది.

పరిపాలనాపరమైన, సాంకేతిక కారణాల వల్ల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, త్వరలోనే మళ్లీ సేవలు ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ వి.ఉమేశ్ తెలిపారు. ఒక ఇన్వెస్టర్ నుంచి 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 165 కోట్లు) సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇవి ఫైనల్ అవుతాయని ఉమేశ్ తెలిపారు.

ఈ పెట్టుబడితోపాటు కొత్త యాజమాన్యం కూడా వస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కొత్త సీఎఫ్ఓగా యోగ నరసింహన్‌ను నియమించినట్టు తెలిపారు. అలాగే, కొత్త సీఈవో ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందన్నారు. ట్రూజెట్ సేవలు మళ్లీ ప్రారంభమవుతాయని, దాని బ్రాండ్‌ను నిలబెట్టేందుకు కృషి చేస్తామని ఉమేశ్ వివరించారు.

  • Loading...

More Telugu News