Russia: వారానికి ఒకటే ఫ్లైట్​.. టికెట్​ ధర భారీగా పెంపు.. ఉక్రెయిన్ నుంచి వచ్చేద్దామనుకుంటున్న భారత విద్యార్థులకు విమానం మోత!

Indian Students In Dilemma After Flight Ticket Rates Increased by 4 Fold
  • చార్జీలను నాలుగు రెట్లు పెంచేసిన వైనం
  • రూ.26 వేల టికెట్ రూ.లక్షకు పెంపు
  • ఇప్పుడు మిస్ అయితే మళ్లీ 20 దాకా నో ఫ్లైట్
ఉక్రెయిన్ లో యుద్ధ పరిస్థితులు భారత విద్యార్థులకు గండంలా మారాయి. అవసరం లేనివాళ్లు అక్కడి నుంచి భారత్ కు వెళ్లిపోవాలంటూ ఆ దేశ రాజధాని కీయివ్ లోని భారత ఎంబసీ అధికారులు భారతీయులకు సూచించారు. అయితే, అక్కడి నుంచి వచ్చేద్దామనుకుంటున్న విద్యార్థులకు ప్రయాణం కంటకంగా మారింది.

ఇప్పటికే మూటాముల్లె సర్దుకుని ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ కు వెళ్లిపోదామనుకుంటున్న వారికి.. విమాన టికెట్ల ధరల రూపంలో షాక్ తగులుతోంది. సాధారణ సమయాల్లో రూ.26 వేలుగా ఉన్న టికెట్ ధర కాస్తా.. ఇప్పుడు రూ.లక్ష దాకా పెరిగిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 20 దాకా భారత్ కు వేరే విమానాలే లేవని ఆందోళన చెందుతున్నారు. దీన్నే అదనుగా చూసుకుని విమానయాన సంస్థ భారీగా రేట్లు పెంచేసిందని రాజస్థాన్  లోని కోటాకు చెందిన ఓ విద్యార్థి చెప్పారు.

అయితే, ఉక్రెయిన్ నుంచి భారత్ కు వారానికి ఒకే ఒక్క ఫ్లైట్ ఉందని అంటున్నారు. వన్ స్టాప్ ఫ్లైట్ కావడంతో డిమాండ్ భారీగా ఉందని, దీంతో విమానయాన సంస్థ టికెట్ ధరను భారీగా పెంచేసిందని చెబుతున్నారు. పర్యవసానంగా టికెట్ ధర భారమై ఎలా రావాలో తెలియక గందరగోళ పరిస్థితుల్లో పడిపోయారు. మరికొందరు మాత్రం ఇండియాకు వచ్చేస్తే తమ చదువు మధ్యలోనే ఆగిపోతుందనే ఆందోళనలో ఉండిపోతున్నారు. కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికీ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ లో 20 వేల మంది దాకా భారత విద్యార్థులున్నారు.
Russia
Ukraine
War
Indian Students
Kyiv

More Telugu News