Warren Buffett: బడా ఇన్వెస్టర్లకు ‘పేటీఎం’ కష్టాలు !

  • బఫెట్ కంపెనీకి 2.41 శాతం వాటా
  • ఒక్కో షేరుకు రూ.1280
  • ప్రస్తుత ధర రూ.870
  • ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకూ భారీ నష్టాలు
  • ఐపీవో ధర రూ.2,150
Warren Buffett among investors sitting on heavy losses in Paytm stock

పేటీఎం పేరుతో డిజిటల్ చెల్లింపులు, స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, రుణ సేవలను అందిస్తున్న వన్ 97 కమ్యూనికేషన్స్ షేరు వాటాదారులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. వారెన్ బఫెట్ సహా బడా ఇన్వెస్టర్ల నుంచి చిన్న ఇన్వెస్టర్ల వరకు ఈ షేరులో అధిక ధర వద్ద చిక్కుకుపోయి లబోదిబో మనే పరిస్థితిలో ఉన్నారు.

మంగళవారం ఈ షేరు రూ.840 వద్ద ఉంటే, బుధవారం రూ.870 సమీపంలో ట్రేడ్ అవుతోంది. మూడు నెలల క్రితమే పేటీఎం ఐపీవో ముగిసింది. ఒక్కో షేరును రూ.2,150 ధరపై కంపెనీ జారీ చేసింది. ఆ ధరతో పోలిస్తే 60 శాతం మేర ఇన్వెస్టర్ల పెట్టుబడి హరించుకుపోయింది.

అమెరికాకు చెందిన సుప్రసిద్ధ బడా ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కు చెందిన బెర్క్ షేర్ హాతవే ఇంటర్నేషనల్ హోల్డింగ్స్.. 2018 సెప్టెంబర్ లో పేటీఎంలో పెట్టుబడులు పెట్టింది. సుమారు రూ.2,179 కోట్లతో 2.6 శాతం వాటా తీసుకుంది. ఒక్కో షేరుకు చెల్లించిన సగటు ధర రూ.1,280గా ఉంది. 2021 డిసెంబర్ నాటికి కంపెనీలో 2.41 శాతం వాటా బెర్క్ షైర్ హాతవేకు ఉంది.

తాజా ధర ప్రకారం చూస్తే బఫెట్ కంపెనీ 35 శాతం నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు యాంట్ ఫిన్ హోల్డింగ్స్ బీవీ, ఎస్ వీఎఫ్ పాంథర్ రూ.1,835 చొప్పున వన్97 కమ్యూనికేషన్స్ షేరును కొనుగోలు చేశాయి. ఇప్పటికి 55 శాతం పెట్టుబడిని నష్టపోయాయి. ఈ ఇన్వెస్టర్లు పేటీఎంలో లాభాలు చూడాలంటే దీర్ఘకాలంపాటు కొనసాగక తప్పేలా లేదు. పలు బ్రోకరేజీ సంస్థలు పేటీఎం షేరు పట్ల సానుకూలంగానే ఉన్నాయి. రూ.1,460 నుంచి రూ.2,530 మధ్య టార్గెట్ లను ఇచ్చాయి.

More Telugu News