Bollywood: ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి కన్నుమూత

Bappi Lahiri Composer Singer Dies In Mumbai Hospital
  • ఓఎస్‌ఏతో గత అర్ధరాత్రి కన్నుమూసిన బప్పీలహరి
  • 1970-80 దశకాలలో తన సంగీతంతో ఉర్రూతలూగించిన బప్పీ 
  • నెల రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స
  • చివరి సినిమా ‘బాఘీ-3’
1980, 90 దశకాలలో డిస్కో మ్యూజిక్‌తో దేశాన్ని ఉర్రూతలూగించిన ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీలహరి కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.

నెల రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన సోమవారమే డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఒక్క రోజులోనే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో కుటుంబ సభ్యులు వైద్యుడిని ఇంటికి పిలిపించారు. పరీక్షించిన ఆయన బప్పీలహరిని తిరిగి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పలు సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ) కారణంగా మృతి చెందినట్టు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ దీపక్ నామ్‌జోషి తెలిపారు.


1970- 80 మధ్యలో బప్పీలహరి సంగీత దర్శకత్వం వహించిన పలు పాటలు యువతను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా ‘డిస్కో డ్యాన్సర్’, ‘చల్తే చల్తే’, ‘షరాబీ’ వంటి సినిమాలు ఆయనకు ఎనలేని పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. బప్పీలహరి చివరి సారిగా ‘బాఘీ 3’ సినిమా చేశారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్-15’లో చివరిసారి కనిపించారు. తన మనవడు స్వస్తిక్ కొత్త పాట ‘బచ్చా పార్టీ’ ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఆ షోకు వచ్చారు.

గతేడాది ఏప్రిల్‌లో కరోనా బారినపడిన బప్పీలహరి  ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Bollywood
Bappi Lahiri
Music Composer
Mumbai

More Telugu News