congress: కాంగ్రెస్ భవిష్యత్తును తేల్చనున్న ఎన్నికల ఫలితాలు!

  • పంజాబ్ లో అధికారం నిలుపుకోవడం ప్రతిష్ఠాత్మకం
  • గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలూ కీలకమే
  • అధికారం సాధిస్తే మరింత బలం
  • బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా మారే అవకాశం
Votes cast CongRESS big dreams depend on two small states

ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ కంటే కాంగ్రెస్ కే కీలకమైనవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయంగా బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా నిరూపించుకోవడం ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. 2014 ఎన్నికల తర్వాత చెప్పుకోలేనంతగా కాంగ్రెస్ బలహీనపడిపోవడం తెలిసిందే. మళ్లీ పుంజుకుని, బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా బలం పుంజుకుని చిన్న పార్టీల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అందుకు ఈ ఎన్నికలను మినీ సెమీ ఫైనల్ గా చెప్పుకోవాల్సిందే.

పంజాబ్ లో కాంగ్రెస్ సర్కారే నడుస్తోంది. ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కు పెద్ద సవాలే. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ క్రమంగా బలపడుతోంది. ప్రీ పోల్ సర్వేలు ఇక్కడ ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లను సంపాదించుకుంటుందని చెప్పాయి. ఇప్పటికే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలకే పరిమితం అయింది. ఈ క్రమంలో పంజాబ్ లో అధికారాన్ని కాపాడుకోవడంతోపాటు.. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో విజయం సాధించడం కాంగ్రెస్ కు తప్పనిసరి.

గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ భాగస్వామ్య పక్షాలు తగ్గిపోయాయి. గతంలో కాంగ్రెస్ తో కలసి సాగిన పార్టీలు కూడా ఇప్పుడు హస్తాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ వంటి వారు బహిరంగంగానే కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ దశలో కాంగ్రెస్ రెండు నుంచి మూడు రాష్ట్రాల్లో విజయం సాధిస్తే కనుక పార్టీ శ్రేణుల్లో అది నమ్మకాన్ని పెంచుతుంది. తిరిగి ప్రాంతీయ పార్టీలకు చేరువ కావడానికి కావాల్సినంత సానుకూలత తీసుకొస్తుంది. లేదంటే అది మరింత బక్కచిక్కిపోయే ప్రమాదం లేకపోలేదు. దీనివల్ల 2024 సార్వత్రిక ఎన్నికల్లో దూకుడుగా వెళ్లే పరిస్థితి ఉండదు.  

  • Loading...

More Telugu News