Kishan Reddy: పూర్తి ఆధారాలు కావాలంటే ఇమ్రాన్ ఖాన్ ను అడగండి: కేసీఆర్ కు కిషన్ రెడ్డి సూచన

  • సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపాలన్న కేసీఆర్
  • అభినందన్ పరాక్రమం ఆధారాలుగా సరిపోవా? అని కిషన్ రెడ్డి ప్రశ్న
  • కేసీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శ
Kishan Reddy suggests KCR to ask Imran Khan for surgical strikes evidence

పాకిస్థాన్ గడ్డపై జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపాలని తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పరాక్రమం సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలుగా సరిపోవా? సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత ఫ్లై జోన్ ను నిషేధించిన పాకిస్థాన్ పై చర్యలు సరిపోవా? అని ప్రశ్నించారు. ఈ ఆధారాలు సరిపోకపోతే నేరుగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పూర్తి ఆధారాలు కోరవచ్చని చెప్పారు.

కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయని కిషన్ రెడ్డి అన్నారు. టుక్డే టుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ తో కేసీఆర్ చేతులు కలిపినట్టు అనుమానంగా ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని... ఇలాంటి తీరును ప్రజలు క్షమించరని అన్నారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సైనికుల ధీరత్వాన్ని, త్యాగాలను ప్రశ్నించేలా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని... ఇది ఆయన మానసిక వైఫల్యాన్ని సూచిస్తోందని అన్నారు. మన సైనికుల కంటే పాకిస్థాన్ సైనికుల మీదే కేసీఆర్ కు ఎక్కువ నమ్మకం ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ పై ఆధారాలు కావాలంటే నేరుగా పాకిస్థాన్ ను కోరాలని అన్నారు.

More Telugu News