YS Vivekananda Reddy: వివేకానందరెడ్డి హత్యకేసులో మళ్లీ మొదలైన సీబీఐ విచారణ.. ముగ్గురు ‘సాక్షి’ విలేకరులను ప్రశ్నించిన అధికారులు

CBI Enquiry started again in vivekanandareddy murder case
  • నిందితుడు దేవిరెడ్డి నుంచి ముగ్గురు ‘సాక్షి’ విలేకరులకు పదేపదే ఫోన్లు
  • వివేకా హత్య జరిగిన రోజు ఆయన ఇంటి నుంచి హడావుడిగా వెళ్లిపోయిన ఉదయ్‌కుమార్
  • డాక్టర్ మధుసూదన్‌‌రెడ్డిని గతంలోనే విచారించిన సీబీఐ
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను సీబీఐ మళ్లీ ప్రారంభించింది. ఇందులో భాగంగా నిన్న ముగ్గురు అనుమానితులను సుదీర్ఘంగా విచారించింది. ఈ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి‌పై చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ ఆయన ఫోన్‌ను సీజ్ చేసింది. ఆయన కాల్‌డేటా ఆధారంగా ముగ్గురు అనుమానితులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వీరిలో ‘సాక్షి’ నెల్లూరు జిల్లా విలేకరి బాలకృష్ణారెడ్డి కూడా ఉన్నారు.

వివేకా హత్య జరిగిన రోజు ఆయన ఇంటి నుంచి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. బాలకృష్ణారెడ్డికి ఫోన్ చేసినట్టు సీబీఐ ఆధారాలు సేకరించింది. అలాగే, జమ్మలమడుగుకు చెందిన ఇద్దరు సాక్షి విలేకరులకు రెండు రోజుల క్రితం సీబీఐ నోటీసులు ఇచ్చింది. వివేకా హత్య జరిగిన రోజు దేవిరెడ్డి నుంచి వీరికి ఎక్కువసార్లు ఫోన్ కాల్స్ వెళ్లినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. అలాగే, పులివెందులకు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు.

గతంలోనూ ఆయనను పలుమార్లు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో వివేకా ఇంటి నుంచి ఉదయ్‌కుమార్ హడావుడిగా వెళ్లిపోయినట్టు వివేకా కుమార్తె సునీత హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో గతంలో పనిచేసిన డాక్టర్ మధుసూదన్‌రెడ్డిని కూడీ సీబీఐ విచారించింది.
YS Vivekananda Reddy
Murder Case
Sakshi
CBI

More Telugu News