Revanth Reddy: అసోం సీఎంను అరెస్ట్ చేయడానికి స్పెషల్ పోలీస్ టీమ్ ను కేసీఆర్ పంపాలి: రేవంత్ రెడ్డి

  • రెండు రోజుల నుంచి బీజేపీ, అసోం సీఎంపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు
  • ఆయనకు చిత్తశుద్ధి ఉంటే హిమంతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి
  • హిమంతను శిక్షించేలా చర్యలు తీసుకోవాలి
KCR to form a special team to arrest Assam CM says Revanth Reddy

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం హిమంత్ పై రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, దాసోజు శ్రవణ్ ఫిర్యాదు చేశారు.

అనంతరం మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హిమంతను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అసోం సీఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం స్పందిస్తుందని భావించామని.. అయితే అలా జరగలేదని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మాతృమూర్తులపై చేసిన దాడి అని చెప్పారు.

గత రెండు రోజుల నుంచి బీజేపీ దుర్మార్గాలపై, అసోం సీఎంపై కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారని... ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ నేతలు హిమంతపై ఇస్తున్న ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకునేలా చూడాలని రేవంత్ అన్నారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ నుంచి స్పెషల్ పోలీస్ టీమ్ ను పంపి హిమంత శర్మను అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందని అన్నారు. న్యాయ నిపుణుల సలహాను తీసుకుని హిమంతను శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి 48 గంటల సమయం ఇస్తున్నామని... చర్యలు తీసుకోకపోతే ఈ నెల మధ్యాహ్నం 16వ తేదీన కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు.

More Telugu News